గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా సంరక్షణ కార్యదర్శులు ఇకపై పోలీసులుగా గుర్తింపు పొందబోతున్నారు. ఈ మేరకు ఏపీ పోలీసు శాఖలో వారిని అంతర్భాగం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పోలీసులు కాని పోలీసులుగా.. తమ పరితిలో మహిళా సంరక్షకులుగా తమ పరిథిలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో విధులు నిర్వర్హించబోతున్నారు.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా సంరక్షణ కార్యదర్శులంతా ఇకపై ‘మహిళా పోలీసు’గా గుర్తించబడతారు. పోలీసుగా విధి నిర్వహణకు అవసరమైన శిక్షణను కూడా వారికి ఇవ్వనున్నారు. దీనికోసం వారి సర్వీసు నియమావళిలో పలు మార్పులు తెస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఈ ఉత్తర్వులపై రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ మాట్లాడుతూ.. మహిళా కానిస్టేబుళ్లు ధరించే పోలీసు యూనిఫామ్‌నే ‘మహిళా పోలీసులు’ ధరిస్తారని, వివిధ చట్టాల అమలుకు సంబంధించి కానిస్టేబుళ్లకు ఉన్న అధికారాలే వీరికి కూడా వర్తించబోతున్నాయని చెప్పారు. మహిళా పోలీసు ఉద్యోగులు తాము పనిచేస్తున్న గ్రామంలో స్థానిక పోలీసుస్టేషన్ ప్రతినిధిగా ఉంటారని, వీరికి పదోన్నతుల విషయంలో కూడా ‘అదనపు హెడ్‌కానిస్టేబుల్’ పోస్టులు సృష్టించబోతున్నామని వివరించారు. దీని కోసం కొత్త చట్టాలను చేయనున్నట్లు పేర్కొన్నారు.
అంతేకాకుండా..తాడేపల్లి ప్రాంతంలో సామూహిక అత్యాచార ఘటన నేపథ్యంలో మహిళల భద్రతపై బుధవారం సీఎం జగన్ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ‘‘రాష్ట్రంలోని ప్రతి మహిళ మొబైల్ ఫోన్‌లో ‘దిశ’ యాప్ తప్పనిసరిగా ఉండేలా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. స్థానిక పోలీసులు ప్రతి ఇంటికీ వెళ్లి మహిళల ఫోన్‌లలో దిశ యాప్‌ను డౌన్లోడ్ చేయించాలని ఆదేశించారు. ‘దిశ’ సిబ్బంది సకాలంలో స్పందించేందుకు రెడీగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇంటెలిజెన్స్ చీఫ్ రాజేంద్రనాథ్ రెడ్డి, దిశ అధికారి దీపికా పాటిల్ తదితరులు పాల్గొన్నారు.