కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్‌లోని కొన్ని రాష్ట్రాలు వివిధ రకాల ఔషధాలను సూచిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా గోవా రాష్ట్రం ఐవర్‌మెక్టిన్ ఔషధానికి ఆమోదం తెలిపింది. కరోనాకు కారణమయ్యే హై ఫీవర్‌ను ఈ ఔషధం తగ్గిస్తుందని, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుందని గోవా ఆరోగ్య శాఖ తెలిపింది. 18 ఏళ్లు నిండిన వారంతా 5 ట్యాబ్లెట్లు వేసుకోవాలని సూచించింది. దేశంలోని కొందరు శాస్త్రవేత్తలు కూడా ఈ ఔషధం తీసుకోవచ్చని సూచిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ఔషధానికి సంబంధించి కీలక హెచ్చరికలు జారీ చేసింది. కరోనా చికిత్సలో ఎట్టిపరిస్థితుల్లోనూ ఐవర్‌మెక్టిన్ వాడవద్దని సూచించింది.
కొవిడ్ చికిత్సలో ఐవర్‌మెక్టిన్ ఔషధాన్ని వినియోగం గురించి డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ ట్విటర్ ద్వారా అనేక కీలక విషయాలను వెల్లడించారు. ‘వ్యాధి చికిత్సలో ఏదైనా కొత్త ఔషధాన్ని చేర్చేటప్పుడు దాని భద్రత, సమర్థతే కీలకం కొవిడ్ చికిత్సలో (క్లినికల్ ట్రయల్స్ మినహా) ఐవర్‌మెక్టిన్‌ను ఉపయోగించొద్దని డబ్ల్యూహెచ్‌ఓ సిఫార్సు’ అని ఆమె ట్వీట్ చేశారు.
ఐవర్‌మెక్టిన్ నోటి ద్వారా తీసుకునే ఔషధం. కాగా.. దీనిపై డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికలు చేయడం గత 2 నెలల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం. ఈ ఔషధం వల్ల కరోనా సోకినవారికి ఆసుపత్రి అవసరం రాదని, కొవిడ్ మరణాలు తగ్గుతాయని చెప్పేందుకు కచ్చితమైన ఆధారాలు లేవంటూ ఈ ఏడాది మార్చి నుంచి డబ్ల్యూహెచ్‌వో చెబుతూనే ఉంది. ఈ క్రమంలోనే మరోసారి ఇదే తరహా హెచ్చరికలను జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.