దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విపరీతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజల నిస్సహాయతను ఆసరాగా చేసుకుని అనేకమంది విచిత్రమైన వైద్యాలను సూచిస్తున్నారు. మరికొంతమంది గో మూత్రం, గో మలాలను కూడా కరోనా మందులుగా సూచిస్తూ, వీటివల్ల కరోనాను జయించవచ్చని ఆశ్చర్యకరమైన వాదనలు సైతం చేస్తున్నారు. కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు రోగనిరోధక శక్తి పెరుగుతుందన్న నమ్మకంతో గుజరాత్‌లోని శ్రీస్వామి నారాయణ్ గురుకుల్ విశ్వవిద్యా ప్రతిష్ఠానంలో కొందరు ఆవుపేడ చికిత్స పొందుతున్నారు. ప్రతి ఆదివారం కొంతమంది ఇక్కడకు వచ్చి పేడ, మూత్రాన్ని ఒంటికి పూసుకుంటున్నారు. కొద్దిసేపు అయ్యాక ఆవు పాలతో శుభ్రం చేసుకుంటున్నారు. ఫ్రంట్‌లైన్ వర్కర్లు, ఔషధ దుకాణాల్లో పని చేసేవారు కూడా ఈ చికిత్స పొందుతుండడం గమనార్హం.
కాగా.. ఈ చికిత్సపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆవు పేడ చికిత్స ప్రమాదకరమని, దాన్ని శరీరానికి పూసుకోవడం వల్ల మ్యూకోమైకోసిస్ వంటి ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు తలెత్తే ముప్పు ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆవుపేడ, మూత్రంతో చికిత్స పనిచేస్తుందని కానీ, కొవిడ్‌కు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తి పెరుగుతుందని కానీ శాస్త్రీయ ఎక్కడా వెల్లడికాలేదని, దీనివల్ల ఇతరత్రా ఇన్‌ఫెక్షన్ల ముప్పు ఉంటుందని హెచ్చరికలు చేస్తున్నారు.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ దిలీప్ మావ్‌లంకర్, మహిళా విభాగం ఛైర్‌పర్సన్ డాక్టర్ మోనా దేశాయ్ ఈ ఆవు పేడ వైద్యంపై స్పందించారు. ‘‘పేడ అనేది శరీరం విసర్జించిన వ్యర్థం. ఇది మరో శరీరాన్ని బలోపేతం చేసి కొవిడ్ ఇన్‌ఫెక్షన్ నుంచి రక్షణ ఇవ్వలేదు. పేడ చికిత్సలో శాస్త్రీయత ఏమీ లేదు. ప్రజలు ఇలాంటి చికిత్సల జోలికి వెళ్లకుండా.. వైద్యులను సూచనలను పాటించాల’ని సూచించారు.