తిరుపతిలోని ఎస్‌వీఆర్ రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోవడం ఒక్కసారిగా రాష్ట్రాన్ని కుదిపేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విపరీతమైన ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రజల ప్రాణాలు పోవడానికి జగన్ వైఫల్యామే కారణమంటూ సోషల్ మీడియాలో భారీగా పోస్టులు ప్రత్యక్షమవుతున్నాయి. ఈ క్రమంలోనే జగన్ తన సీఎం పదవికి రాజీనామా చేయాలంటూ ట్విటర్ వేదికగా #ResignJagan హ్యాష్‌ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. మంగళవారం మధ్యాహ్నం 1.45 గంటలకు 20.5 వేల ట్వీట్లు ఈ హ్యాష్‌పై నమోదయ్యాయంటే ఇక ఏ స్థాయిలో ట్రెండ్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు.
అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి చేతకాని తనం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని అనేకమంది నెటిజన్లు సోషల్ మీడయాలో కామెంట్లు చేస్తున్నారు. కోవిడ్-19 సెకండ్ వేవ్ వల్ల ఇన్ని వేల మంది ప్రాణాలు కోల్పోతున్నా.. కనీసం ఒకసారి కూడా ముఖ్యమంత్రి మీడియా సమావేశం నిర్వహించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి ఆయన బయటకు రావడం లేదని, ముఖ్యమంత్రి అయిఉండి ఇలా చేయడం దారుణమని, అసలు జగన్ సీఎంగా అనర్హుడంటూ పోస్టులు పెడుతూ సోషల్ మీడియాను ముంచెత్తుతున్నారు.
ఇదిలా ఉంటే కరోనా మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని బతుకుతున్నారు. కరోనా సోకినా చికిత్స అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సరైన వైద్యులు, వైద్య సదుపాయాలు సామాన్యులకు అందుబాటులో లేకపోవడంతో కోవిడ్ బాధితులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ సమయంలోనే సోమవారం రాత్రి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత కారణంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం.. రుయా ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డులో ఆక్సిజన్ అందకపోవడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనితో పాటు ఇలాంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల నమోదవుతూనే ఉన్నాయి.