బెంగాల్‌లో బీజేపీని దారుణంగా ఓడించి మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకుంది టీఎంసీ. ఏకంగా 200కు పైగా స్థానాలలో విజయ కేతనం ఎగురవేసి అధికారం చేపట్టింది. ఈ క్రమంలోనే నేడు టీఎంసీ అధినేత మమతా బెనర్జీ మూడోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ క్రమంలోనే ఆమె దేశ ప్రధాని నరేంద్ర మోదీకి థాంక్స్ చెప్పారు. అదేంటి..? ప్రత్యర్థి బీజేపీ నేత అయిన మోదీకి దీదీ థాంక్స్ ఎందుకు చెప్పిందా..? అని ఆశ్చర్యపోకండి. అంతకుముందు మోదీ కూడా మమతకు శుభాకాంక్షలు చెప్పారు. సీఎంగా ఆమె ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆమెకు మోదీ శుభాకాంక్షలు చెప్పారు. దానికి సమాధానంగానే దీదీ కూడా రిటర్న్ విష్ చేశారు.
సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మమతా బెనర్జీకి.. ప్రధాని ట్విటర్లో ‘పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మమత దీదీకి శుభాకాంక్షలు..’ అని పేర్కొన్నారు. ప్రధాని నుంచి శుభాకాంక్షలు రావడంతో దీదీ కూడా మోదీకి థాంక్స్ చెప్పారు. అలాగే బెంగాల్‌కు కేంద్రం నుంచి నిరంతర మద్దతు ఉండాలని ఆకాంక్షించారు. ‘శుభాకాంక్షలు తెలిపినందుకు నరేంద్రమోదీకి కృతజ్ఞతలు. పశ్చిమ బెంగాల్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం నిరంతర సాయం అందిస్తుందని ఆశిస్తున్నాను. కేంద్రానికి నా పూర్తి సహకారం ఉంటుంది. కరోనా మహమ్మారి సహా ఇతర సవాళ్లను ఎదుర్కొనేందుకు కలిసికట్టుగా పోరాడాలనీ.. కేంద్ర-రాష్ట్రాల సంబంధాలకు సరికొత్త ప్రమాణాలు నెలకొల్పాలని ఆశిస్తున్నాను..’ అని మమత తన ట్వీట్లో పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే మోదీతో పాటు అనేకమంది ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నేతలు మమతా బెనర్జీకి శుభాకాంక్షలు తెలిపారు. శివసేన నేత సంజరురౌత్ ట్వీటర్ వేదికగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ‘బెంగాల్ పులికి శుభాకాంక్షలు’ అని ఆయన పేర్కొన్నారు. అలాగే ఎన్‌సీపీ అధినేత, మాజీ కేంద్ర మంత్రి శరద్‌పవార్ కూడా ఓ ప్రకటన ద్వారా మమతా బెనర్జీని అభినందించారు. ప్రజాసంక్షేమం కోసం చేసే కృషి కొనసాగాలని కోరారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి కమల్ నాథ్.. మమతను ఏకంగా దేశానికే నాయకురాలంటూ ఆకాశానికెత్తేశారు. మరికొంతమంది కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.