భారత దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఎంత దారుణంగా ఉందో వేరే చెప్పక్కర్లేదు. ఈ మహమ్మారి ధాటికి భారత్ వణికిపోతోంది. ప్రతి రోజూ లక్షల కేసులు. వేల మరణాలు. నిద్ర లేస్తే ఎవరి గురించి ఏ చేదు వినాల్సి వస్తుందోనని అంతా ప్రాణాలు గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. దీంతో ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో కర్ఫ్యూ, లాక్‌డౌన్ తరహా ఆంక్షలను కూడా అక్కడి ప్రభుత్వాలు అములు చేస్తూ కరోనాను కట్టడి చేసేందుకు నానా అవస్థలు పడుతున్నాయి. అయితే ఇప్పుడు వినిపిస్తున్న మరో భయంకరమైన విషయం ఏంటంటే.. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న కరోనా సెకండ్ వేవ్ కంటే మరింత ఘోరమైన థర్డ్ వేవ్ కూడా వస్తుందట. ఈ విషయంపైనే ఇప్పుడు కేంద్ర ఆరోగ్య శాఖ తాజా హెచ్చరికలు జారీ చేసింది.
భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ కచ్చితంగా వస్తుందంటూ కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. అంతేకాకుండా భవిష్యత్తులో మరిన్ని వేవ్‌లు కూడా వస్తాయని, వీటిని ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. దానికి తోడు కరోనా వైరస్ కొత్త రకాలు కూడా వస్తాయని, వాటిని ఎదుర్కొనేందుకు అవసరమైన వ్యాక్సిన్‌లను కూడా తయారు చేసుకోవాలని, అందుకు అవసరమైనట్లు వాటిలో సామర్థ్యాలను పెంచుకోవాలని సూచించింది.
దీనిపై కేంద్ర ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారు డాక్టర్ విజయ్‌రాఘవన్ మాట్లాడారు. ఆయన భవిష్యత్తులో కరోనా గురించి వివరిస్తూ.. ‘ప్రస్తుతం వైరస్ సంక్రమణ స్థాయిలను బట్టి చూస్తే ఫేజ్ 3 (థర్డ్ వేవ్) అనివార్యం. అయితే, ఈ థర్డ్ వేవ్ ఎప్పుడు సంభవిస్తుందనే విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పలేం. మరిన్ని వేవ్‌లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. వైరస్‌లో ఏర్పడే మార్పులను ముందుగానే అంచనా వేసి.. వాటికి అనుగుణంగా వ్యాక్సిన్‌ల సామర్థ్యాలను ఎప్పటికప్పడు పెంచుకోవడం ఎంతో అవసరం’ అని స్పష్టం చేశారు.
ఇక కేంద్ర ఆరోగ్యశాఖ నిపుణుల బృందం మాట్లాడుతూ.. అంతేకాకుండా మొదటి, రెండో దశల్లో వైరస్ ఉద్ధృతిలో ఎలాంటి మార్పులు వచ్చాయి..? వాటికి గల పలు కారణాలను విశ్లేషించారు. ప్రస్తుతం సెకండ్ వేవ్ ఇంత ఉద్ధృతంగా పెరగడానికి వైరస్‌లో మార్పులు, రోగనిరోధకత వ్యవస్థను తప్పించుకునే సామర్థ్యమున్న మ్యుటేషన్ వంటి అంశాలే కారణమని తెలిపింది. అయితే, రాబోయే రోజుల్లో ఎదురయ్యే మరిన్ని వేవ్‌ల ప్రభావం ఎక్కువ, లేదా తక్కువగా ఉంటుందనే విషయం ఇప్పుడే చెప్పలేమన్నారు. చెప్పలేమని స్పష్టం చేసింది.