గుజరాత్‌లో మినీ జపాన్ సృష్టించడమే తన కలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జపాన్‌తో తనకు వ్యక్తిగత అనుబంధం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.
జపనీయులు ప్రదర్శించే ఆత్మీయత, పని సంస్కృతి, నైపుణ్యాలు, క్రమశిక్షణలను ప్రశంసించారు.
ఆదివారం ఆయన అహ్మదాబాద్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (ఏఎంఏ)లో జెన్ గార్డెన్, కైజెన్ అకాడమీలను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు.
ఈ సంస్థల ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన హ్యోగో ప్రిఫెక్చర్ నేతలకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా హ్యోగో గవర్నర్ తొషిజో ఇడో, హ్యోగో ఇంటర్నేషనల్ అసోసియేషన్లను అభినందించారు.
ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) తెలిపిన వివరాల ప్రకారం, అనేక సంవత్సరాలుగా ‘వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్’లో జపాన్ ఉత్సాహంగా పాల్గొన్న విషయాన్ని మోదీ ప్రస్తావించారు.
ఆటోమొబైల్, బ్యాంకింగ్, నిర్మాణం, ఫార్మా వంటి అనేక రంగాల్లో దాదాపు 135 కంపెనీలు గుజరాత్‌ను తమ కేంద్రంగా చేసుకున్నాయని చెప్పారు.
సుజుకి మోటార్స్, హోండా మోటార్‌సైకిల్, మిత్సుబిషి, టయోటా, హిటాచీ వంటి కంపెనీలు గుజరాత్‌లో తయారీ రంగంలో ఉన్నాయని మోడీ గుర్తు చేశారు.
ఈ సందర్భంగా భారత్-జపాన్ మధ్య సంబంధాలకు నూతన శక్తిని ఇస్తున్న ఇండో-జపాన్ ఫ్రెండ్‌షిప్ అసోసియేషన్‌ను అభినందించారు. జపాన్‌లోని జెన్, భారత దేశంలోని ధ్యానం మధ్య సారూప్యతల గురించి మోదీ వివరించారు.
ఈ క్రమంలోనే జపాన్ మాజీ ప్రధాన మంత్రి షింజో అబే గుజరాత్ పర్యటనను మోదీ గుర్తు చేసుకున్నారు.
ఆయన పర్యటన వల్ల భారత్-జపాన్ సంబంధాల్లో నూతనత్వం వచ్చిందన్న మోదీ.. కోవిడ్ మహమ్మారి సమయంలో అంతర్జాతీయ సుస్థిరత, సౌభాగ్యాలకు భారత్-జపాన్ స్నేహ సంబంధాలు చాలా ముఖ్యమైనవిగా మారినట్లు తెలిపారు.
భారత్-జపాన్ స్నేహం, భాగస్వామ్యం మరింత బలోపేతమవాలని ప్రస్తుత సవాళ్లు డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు.
గుజరాత్ లో ఏర్పాటు చేస్తున్న కంపెనీలు స్థానిక యువత తమ నైపుణ్యాలను అభివృద్ధి పరచుకోవడానికి దోహదపడతాయని, టెక్నికల్ యూనివర్సిటీలు, ఐఐటీలతో అనుబంధాన్ని ఏర్పరచుకుని, జపాన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థ వందలాది మంది యువతకు శిక్షణ ఇస్తోందని మోదీ పేర్కొన్నారు.