న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవలే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌సీ) 12వ తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ప్రధాని ఆధ్వర్యంలో జరిగిన ఓ సమావేశంలో కేంద్ర మంగళవారం ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని తెలిపారు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా ప్రధాని స్వయంగా ప్రకటించారు. దీంతో దేశ వ్యాప్తంగా సీబీఎస్‌సీ విద్యార్థులంతా ఆనందం వ్యక్తం చేశారు. ప్రధాని నిర్ణయాన్ని ప్రశంసించారు.
అయితే తాజాగా ఓ 12వ తరగతి విద్యార్థి ఫేర్‌వెల్(వీడ్కోలు) పార్టీ గురించి ఏకంగా మోదీతోనే విన్నవించుకున్నారు. ఆ విన్నపంలో ఓ వింత కోరిక కూడా కోరాడు. తన క్లాస్‌మేట్ అమ్మాయి నేహాను చీరలో చూడాలని, అందుకోసం ఫేర్‌వెల్ పార్టీ చేసుకోనివ్వండంటూ కూకీ అగర్వాల్ అనే ఓ కుర్రాడు మోదీకి ట్వీట్ చేశాడు. ‘సర్ ఫేర్ వెల్ అయినా నిర్వహించుకోనివ్వండి. మా తరగతి బీ సెక్షన్ చెందిన నేహాని చీరలో చూడాలి’ అని తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు.
కుకీ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. దాదాపు 338 మంది ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. దాదాపు 1400 కు పైగా లైక్ చేశారు. దీనిపై జోకులు, మీమ్‌లు కూడా పుట్టుకొచ్చాయి. అంతేకాదు.. అప్పటికప్పుడు ‘neha 12th B’ పేరుతో ట్విటర్ ఖాతాలు కూడా పుట్టుకొచ్చాయి. అందులో ‘సారీ కుకీ.. నాకు శారీ కట్టుకోవడం రాదు’ అంటూ రిప్లై కూడా ఇవ్వడం విశేషం. అంతేకాదు.. ఈ ట్వీట్‌కు సంబంధించి ఓ వాట్సాప్ చాట్ కూడా బయటకొచ్చింది. నేహ, కుకీల పేర్లతో చాట్ చేసుకున్నట్లు ఆ చాట్ కనిపిస్తుంది. అందులో నేహా ‘నన్ను చీరలో చూడాలనుకుంటే నాకే పర్సనల్‌గా చెప్పవచ్చు కదా. ఇప్పుడు చూడు అందరూ నాకు మెసేజ్‌లు చేస్తున్నారు’ అని మెసేజ్ చేసింది. దానికి కుకీ ‘నన్నేం చేయమంటావ్. నాకేం తెలుసు నా ట్వీట్ అంత వైరల్ అవుతుందని..?’ అని రిప్లై వచ్చినట్లు ఆ చాట్‌లో గమనించవచ్చు.