హైదరాబాద్: వర్షం పడినప్పుడు ఆకాశంలో రెయిన్‌బో(ఇంద్రధనుస్సు) ప్రత్యక్షం కావడం మనం చూస్తుంటాం. అది ఓ ధనుస్సులా కనిపిస్తుంది. కానీ సూర్యడి చుట్టూ, చంద్రుడి చుట్టూ కూడా ఇలాంటి రంగుల రింగ్‌లు ఏర్పడుతుంటాయి. వాటిని హోలో అంటారు. ఈ వింత నేడు(బుధవారం) నగరంలో కనిపించింది. సూర్యుడి చుట్టూ సరికొత్తగా ఏడు రంగులతో కూడిన ఓ వలయాకారం ప్రతక్షమైంది. దాదాపు గంట సేపు ఈ దృశ్యం ఆకాశంలో కనువిందు చేసింది. దీనిని చూసేందుకు జనం ఎగబడ్డారు. మరికొతమంది ఔత్సాహికులు తమ మొబైల్ ఫోన్లలో ఈ అద్భుత దృశ్యాలను బంధించారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
గత నెలలో బెంగళూరులో కూడా ఇదే తరహా దృశ్యం కనిపించింది. అప్పట్లో ఆ దృశ్యాలు కూడా నెట్టింట వైరలయ్యాయి. దీనిపై శాస్త్రవేత్తలు స్పందిస్తూ.. వీటిని సన్ హాలో అంటారని తెలిపారు. ఇలాంటి వలయాలే చంద్రుడి చుట్టూ కూడా ఏర్పడతాయిని, వాటిని మూన్ హాలో అంటారని తెలిపారు. వర్షం లేదా మంచు కురిసే ముందు ఇలా ఏర్పడతాయని చెప్పుకొచ్చారు. సూర్యుడి కిరణాలు చుట్టూ ఉన్న తేమతో కూడిన మేఘాలకు తగలడంతో అక్కడ ఈ హాలో ఏర్పడుతుందని చెబుతున్నారు.
ఏంటీ రంగుల వలయం..?
సూర్యడి చుట్టూ ఇలా రంగులతో వలయాలు ఏర్పడడాన్ని సన్ హాలో అంటారు. సూర్యుడి చుట్టూ కానీ, చంద్రుడి చుట్టూ కానీ ఇలా వలయాకారం ఏర్పడుతుంటాయి. సూర్యుడి చుట్టూ ఏర్పడే వలయాలను సన్ హాలో అన్నట్లే.. చంద్రుడి చుట్టూ ఏర్పడే వలయాలను మూన్ హాలో అంటారు. ఇలా వలయాలు ఏర్పడడం వర్షం లేదా మంచు కురవడానికి సూచనగా పరిశోధనకులు చెబుతారు. దీనిని నిజం చేస్తూ ఈ వలయాలు కనిపించిన గంట, రెండు గంటల్లో నగరంలో పెద్ద వర్షం కురిసింది.
అశుభమంటూ ప్రచారం:
సూర్యుడు చుట్టూ ఇలా వలయాకారం ఏర్పడటం అశుభమంటూ ఇప్పటికే కొన్ని పుకార్లు పుట్టుకొచ్చాయి. దీనివలల అనర్థాలు జరుగాయని, భూమిపై అరిష్టమని ఇష్టం వచ్చినట్లు రూమర్లు మొదలయ్యాయి. అయితే ఈ పుకార్లను నమ్మొద్దని బిర్లా ప్లానిటోరియం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సైంటిఫిక్ పరిభాషలో వీటిని “22-డిగ్రీ హలోస్” అని పిలుస్తారని తెలిపారు. ఎందుకంటే ఒక ప్రదేశంలో ఒక పరిశీలకునికి సూర్యుడు లేదా చంద్రుని చుట్టూ ఏర్పడ్డ రింగ్ సుమారు 22 డిగ్రీల వ్యాసార్థం ఉంటుందన్నారు.