తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించడంపై ఆ పార్టీ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకట రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
అది తెలంగాణ పీసీసీ కాదని, టీడీపీ పీసీసీగా మారిందంటూ మండిపడ్డారు. ఇకపై తాను గాంధీ భవన్ మెట్లు కూడా ఎక్కనంటూ శపథం చేశారు.
ఆదివారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. పీసీసీ తనకు దక్కకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
పార్టీ పెద్దలపై కూడా కోమటిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పీసీసీ నియామకం విషయంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ అమ్ముడు పోయారని, ఓటుకు నోటు మాదిరిగానే నోటుకు పీసీసీ అనేలా మారిందని తీవ్ర విమర్శలు గుప్పించారు.
కాగా.. ఇప్పటివరకు తన రాజకీయ భవిష్యత్‌పై నిర్ణయం తీసుకోలేదని, తన నియోజకవర్గ ప్రజలే తన రాజకీయ భవిష్యత్‌ను నిర్ణయిస్తారని అన్నారు.
అలాగే తన పార్లమెంట్ నియోజకవర్గంలో పరిధిలోని ఇబ్రహీంపట్నం నుంచి ప్రతీ గ్రామంలో పర్యటించి కొత్త నాయకత్వాన్ని తయారు చేస్తానని అన్నారు.
ఈ నియామకంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని అన్న కోమటిరెడ్డి.. అంతేకాదు టీడీపీ నుంచి వచ్చిన నేతలు ఎవరూ తనను కలవొద్దని తేల్చి చెప్పారు.
అయితే తెలంగాణ ఇచ్చిన సోనియా, రాహుల్ గాంధీపై మాత్రం విమర్శలు చేయనని చెప్పడం గమనార్హం.