టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎంపిక కావడంపై ఆ పార్టీ కీలక నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్క హర్షం వ్యక్తం చేశారు.
మంగళవారం రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే రేవంత్ కూడా సీతక్కపై ప్రశంసలు కురిపించారు.
సీతక్క తనతో సరిసమానమని, తనకు, సీతక్కకు ఒకటే కుర్చీ ఉంటే.. అందులో సీతక్కనే కూర్చో పెడతానని చెప్పుకొచ్చారు.
‘‘నాకు పీసీసీ పదవీ వస్తదని నిఘా వర్గాల రిపోర్ట్ రాగానే.. ప్రగతి భవన్ తలుపులు తెరిచారు. ఖబర్దార్ కేసీఆర్.. నీ సంగతి చూస్తా. కరెంట్ తీగలా కాదు.. హై టెన్షన్ వైర్లలా కొట్లాడతాం.
పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐ, సీఐలకు పోస్టింగ్ ఇవ్వాలంటే లక్షల్లో వసూలు చేస్తున్నారు’ అంటూ టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు.
టీఆరెస్ జెండా మోసిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు సంతోషంగా ఉన్నారేమో గుండె మీద చేయి వేసుకొని చెప్పాలని, దిక్కులేక స్థానిక ప్రజాప్రతినిధులు బ్రోకర్లుగా, పైరవీకారులుగా మారుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీఆరెస్ పాలనలో స్థానిక ప్రజా ప్రతినిధులకు విలువ లేకుండా పోయిందని, లోకల్ లీడర్లు రోడ్డున పడ్డారని, పార్టీ నుంచి నిధులు అందక సొంత డబ్బులను ఖర్చు చేస్తున్నారని రేవంత్ రెడ్డి, అయినా వారికి గుర్తింపు, విలువ ఉండడం లేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
ఇదిలా ఉంటే రేవంత్ ను కలిసిన తర్వాత సీతక్క మాట్లాడుతూ.. తాము అధికారాన్ని అనుభవించడానికి కాంగ్రెస్ లోకి రాలేదని, ప్రతిపక్షంలో ఉన్న పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పార్టీలో చేరామని అన్నారు.
పార్టీ పలుచన అయ్యేలా ఎవరూ మాట్లాడ వద్దని, అది అందరికీ నష్టం కలిగిస్తుందని చెప్పారు. మెజారిటీ అభిప్రాయం మేరకే రేవంత్ రెడ్డికి పీసీసీ వచ్చిందని, దీనిని అందరూ స్వాగతించాలని కోరారు.
అలాగే పార్టీని అధికారంలోకి తెచ్చినప్పుడే తమకు నిజమైన సంతోషమని పేర్కొన్నారు.