తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఫుల్ హీటెక్కించే విషయం ఏదైనా ఉందంటే అది రానున్న హుజూరాబాద్ ఎన్నికలే. ఈ ఎన్నికలు అటు టీఆర్ఎస్‌కు, ఇటు బీజేపీలో చేరిన ఈటలకు చాలా ప్రతిష్ఠాత్మకంగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఈ నియోజకవర్గ ఎన్నికల గురించి తాజాగా టీపీసీసీ పదవి చేపట్టిన రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. హుజూరాబాద్‌లో ప్రజల ఓట్లు ఈటలకే పడతాయని అన్నారు. అయితే అది ఈటల వల్లనే సాధ్యమవుతుందని, బీజేపీని చూసి ఆ ఓట్లు పడవని వ్యాఖ్యానించారు. కేసీఆర్ అనే రాక్షసుడ్ని తప్పించుకోవడానికి తాత్కాలిక ఉపశమనంగా ఈటల బీజేపీలోకి వెళ్లారని, అయితే ఆయన బీజేపీలోకంటే కాంగ్రెస్‌లోకి వచ్చి ఉంటే స్వేచ్ఛగా కేసీఆర్‌పై కొట్లాడేవారని రేవంత్ అభిప్రాయపడ్డారు.
ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన రేవంత్.. ‘దుబ్బాకలో బీజేపీ గెలుపునకు కారణం రఘునందన్. అతడిని చూసే అక్కడి ప్రజల ఓట్లు పడ్డాయి. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్, కేసీఆర్.. ఇద్దరూ డబ్బు బలంతో బరిలోకి దిగుతున్నారు. నేను వేల మంది కార్యకర్తల బలంతో బరిలోకి దిగుతాను. కేసీఆర్ అనే రాక్షసుడ్ని తప్పించుకోవడానికి తాత్కాలిక ఉపశమనంగా ఈటల బీజేపీలోకి వెళ్లారు. అర్థరాత్రి కిషన్‌రెడ్డి ఈటలతో రహస్యంగా మాట్లాడి ఆయనకోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి మరీ ఢిల్లీ తీసుకెళ్లారు. అది ఎలా సాధ్యమయిందో చెప్పాలి. అంతేకాదు.. ఈటల కనుక కాంగ్రెస్‌లో చేరి ఉంటే ప్రభుత్వంపై స్వేచ్ఛగా కొట్లాడేవారు. కానీ బీజేపీలో ఆ ఛాన్స్ ఉండదు. కేసీఆర్‌పై యుద్ధం చేస్తామని బీజేపీలోకి వెళ్లినవారు ఏమయ్యారు’ అని రేవంత్ అన్నారు.
అంతేకాకుండా రాష్ట్రంలో గెలిచిన తరువాత కేసీఆర్ ఇచ్చిన ఏ హామీని అమలు చేయలేదు. ప్రజలకు ఆ పార్టీపై, సీఎంపై నమ్మకం పోయిందని, ఈ ప్రభుత్వం పూర్తికాలం మనుగడ సాగించలేదని రేవంత్ అన్నారు. తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని జోస్యం చెప్పారు.
అనంతరం ఏపీ పార్లమెంట్ నేత విజయసాయి గురించి మాట్లాడుతూ.. అతడు పైసాకు కూడా పనికిరాడని షాకింగ్ కామెంట్స్ చేశాడు. తిక్కలోడు విజయసాయిరెడ్డి మాటలు పట్టించుకోనని చెప్పారు. విజయసాయిరెడ్డి రాజకీయంగా అణాపైసా విలువ చేయడని విమర్శించారు. ప్రగతిభవన్‌పై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ‘శ్రీకాంతాచారి తల్లిదండ్రులకు వార్డు మెంబర్ అన్నా ఇచ్చారా?, ఏనాడైనా అమరవీరుల కుటుంబాలను పిలిచి భోజనం పెట్టారా?’ అని వ్యాఖ్యానించారు.