లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పోతిరెడ్డిపాడు కాల్వకు నీటిని ఎత్తిపోసే ప్రాజెక్టు ముమ్మాటికీ అక్రమమేనని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రాయలసీమలోని ఈ ప్రాజెక్టు గురించి, కృష్ణా జలాల వినియోగం గురించి సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును అక్రమ ప్రాజెక్టుగా ఏపీ గుర్తించడం లేదని, పర్యావరణ అనుమతులు, ఎన్జీటీ స్టే విధించినప్పటికీ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారని సీఎం కేసీఆర్ ఆరోపించారు.
ఈ నెల 9న నిర్వహించే కృష్ణా బోర్డు త్రిసభ్య సమావేశం రద్దు చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ‘ఈ నెల 20 తర్వాత పూర్తిస్థాయి బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, అందులో తెలంగాణ రాష్ట్ర అంశాలను ఎజెండాలో చేర్చాలని, కృష్ణా బోర్డు సమావేశంలో తమ వాదన వినిపిస్తామని సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు. విద్యుత్ ఉత్పత్తి ఆపాలని ఏపీ ఫిర్యాదు చేయడం హాస్యాస్పదమని, శ్రీశైలం డ్యాం దగ్గరికి ప్రాజెక్టు ఉద్యోగులను మాత్రమే అనుమతించాలని కేసీఆర్ పేర్కొన్నారు.
‘జూరాల, శ్రీశైలం, సాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో నీటి లభ్యత ఉన్నంతకాలం పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేయండి. విద్యుత్ ఉత్పత్తిని ఆపాలని చెప్పే హక్కు కృష్ణా బోర్డుకు లేదు. జలవిద్యుత్‌కు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి ఒప్పందాలు లేవు. కృష్ణా జలాలు సముద్రంలోకి వృథా చేస్తున్నారనే ఏపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి. తెలంగాణకు హక్కుగా కేటాయించిన నీటినే శ్రీశైలం ప్రాజెక్టులో వాడుకుంటున్నాం. దీనిని ఎవరూ అడ్డుకోలేరు’ అని కేసీఆర్ తేల్చి చెప్పారు.