రాష్ట్ర సీఎం కేసీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేడు ప్రారంభించారు. సిరిసిల్ల నియోజకవర్గం మండేపల్లిలో పేదల కోసం రూ. 87 కోట్లతో సకల వసతులతో నిర్మించిన 1320 డబుల్ బెడ్రూం ఇండ్లను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించి లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్, చీఫ్ సెక్రెటరీ సోమేష్ కుమార్ ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
మొదట సీఎం కేసీఆర్‌తో వేద పండితులు పూజలు చేయించారు. ఇక రిబ్బన్ కట్ చేసి ఇంటి లోపలికి వెళ్లడమే తరువాయి. కానీ, రిబ్బన్ కట్ చేయడానికి కత్తెర లేదు. ప్రారంభోత్సవం కోసం భారీ ఏర్పాట్లు చేసిన అధికారులు.. రిబ్బన్‌ను కట్ చేసే చిన్న కత్తెరను మాత్రం మరిచారు. దీంతో కత్తెర కోసం కాసేపు వేచి చూసిన సీఎం.. వాకిలి వద్దే నిలబడ్డారు. అయితే కొంతసేపు వేచిచూసిన కేసీఆర్ అసహనంతో చేత్తోనే రిబ్బన్‌ను తొలగించి లబ్ధిదారులను దగ్గరుండి ఇంట్లోకి తీసుకెళ్లారు. ఈ పరిణామంతో అధికారులు షాకయ్యారు.
కాగా.. సిరిసిల్లలో డబుల్ బెడ్ ఇళ్ల ప్రారంభం అత్యంత వైభవంగా సాగింది. జిల్లాలోని అనేకమంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ ఇళ్లకు అందించారు. సీఎం కేసీఆర్ స్వయంగా ఇళ్ల నిర్మాణాన్ని, పటిష్ఠతను పరిశీలించి, అధికారులను అనేక ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకున్నారు.