సీఎం కేసీఆర్ అధ్యక్షతన నీకు అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. పలు పార్టీలకు చెందిన కీలక నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దళితుల సమస్యలపై చర్చించారు.
సమాజాన్ని ముందుకు నడిపించడంలో ప్రభుత్వాలది కీలక పాత్ర అని, చంటి పిల్లలను పెంచి పోషించేలా ప్రభుత్వ పాలన సాగాలని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
‘నిర్లక్ష్యం వహిస్తే రేపటి తరాలు నష్టపోతాయి. అందుకు బాధ్యులు పాలకులే అవుతారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ ఊరికి పోయినా సామాజికంగా, ఆర్థికంగా దళితులే పీడిత వర్గాలు.
దళితుల సామాజిక, ఆర్థిక బాధలు తొలగిపోవాలంటే ఏం చేయాలో..? దశలవారీగా కార్యాచరణ అమలు చేయబోతున్నాం.
దళితులు ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లడానికి ప్రభుత్వం ఏం చేయాలో మీ నుంచి సూచనలు కోరుతున్నాం’ అని కేసీఆర్ ఇతర పార్టీల నేతలను కోరారు.
సమావేశంలో రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీల సంక్షేమం, వయో వృద్దుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, మధిర ఎమ్మెల్యే, కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత మల్లు భట్టివిక్రమార్క, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పాల్గొన్నారు.
సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలివే..
సీఎం దళిత సాధికారత పథకంపై అన్ని పార్టీలు కలిసి నిర్ణయం తీసుకోగా.. ప్రధానంగా ఈ పథకం కోసం రూ.1200 కోట్ల నిధులను మంజూరు చేయనున్నారు. ఒక్కో యూనిట్‌కి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించనున్నారు.
నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో ఈ సొమ్మును జమ చేయబోతున్నారు. మొదటి దశలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 100 కుటుంబాల చొప్పున 10 వేల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించనున్నారు.
ఈ సాయాన్ని నేరుగా దళిత కుటుంబాలకు అందజేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.