తెలుగు రాష్ట్రాల మధ్య ఇన్నాళ్ళో నీటి కోసం కొట్లాట జరిగేది. కానీ ఇప్పుడు ఆ కొట్లాట తగ్గలేదు సరి కదా.. రెండు రాష్ట్రాల మధ్య కొత్త తగాదా మొదలైంది.
అదే కరెంట్ ఉత్పత్తి విషయంలో వివాదం. రాష్ట్రంలో ఉన్న జల విద్యుత్ ద్వారా 100 శాతం ఉత్పత్తి చేయాలని తెలంగాణ విద్యుత్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
దీంతో విద్యుదుత్పత్తిపై ఆయా జల విద్యుత్ సంస్థలు దృష్టి సారించాయి. అయితే ఇక్కడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
విద్యుదుత్పత్తి కోసం తెలంగాణ ప్రభుత్వం నీటిని అక్రమంగా మళ్ళిస్తోందని ఆరోపిస్తోంది. ఈమేరకు క్రియేహ్నా బోర్డుకు ఏపీ సర్కారు లేఖ రాయడంతో వివాదం ముదురుతోంది.
తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు సంబంధించిన ఎడమ విద్యుత్ కేంద్రానికి నీటిని నిలిపివేయాలని ఏపీ సర్కార్ ఇటీవల కృష్ణా నీటి పంపిణీ బోర్డు(కేఆర్ఎంబీ)కు లేఖ రాసింది.
ఏపీ లేఖకు స్పందించిన కేఆర్ఎంబీ.. తక్షణమే ఎడమ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి నీటిని నిలిపివేయాలని తెలంగాణ విద్యుత్ సంస్థలకు లేఖ రాసింది.
కాగా .. దీనిపై తెలంగాణ నుంచి ఇంకా ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో టీఎస్ జెన్‌కో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఉత్కంఠ నెలకొంది.
మరి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఈ వివాదం ఎంత దూరం వెళుతుందో ఏమో.