తెలంగాణలో లాక్‌డౌన్ విధిస్తున్నట్లు రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ నెల 12వ తేదీ అంటే రేపటి నుంచి 10 రోజుల పాటు రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించనున్నట్టు ప్రకటించింది. బుధవారం ఉదయం 10 గంటల నుంచి ఈ లాక్ డౌన్ అమలోకి వస్తుందని తెలిపింది. ఇంతకుముందే రాష్ట్ర హైకోర్టుతో సహా పలువురు నిపుణులు కరోనా నియంత్రణకు లాక్‌డౌన్ ఒక్కటే మార్గమని చెబుతూ వచ్చారు. కానీ రాష్ట్ర సర్కార్ మాత్రం లాక్‌డౌన్ విధించడాన్ని వ్యతిరేకించింది. అయితే ఎట్టకేలకు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ రోజు అధికారులు, మంత్రులతో సీఎం కేసీఆర్ క్యాబినెట్ మీటింగ్ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్యాబినెట్ ప్రకటించింది.
దేశవ్యాప్తంగా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో తాజా కేబినెట్ భేటీలో కేసీఆర్ సర్కార్ కూడా లాక్‌డౌన్ వైపు మొగ్గు చూపింది. కాగా.. కొద్ది రోజుల క్రితం జరిగిన క్యాబినెట్ మీటింగ్‌లో రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించే ప్రసక్తే లేదని, లాక్‌డౌన్ వల్ల రాష్ట్ర ఆర్థిక స్థితి దెబ్బతింటుందని, ప్రజా జీవనం స్థంభించిపోతుందని కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో అనేకమంది పేదలున్నారని, లాక్‌డౌన్ వల్ల వారు ఆకలితో అలమటిస్తారని, అందువల్ల లాక్‌డౌన్ విధించమని స్పష్టం చేశారు. కానీ తాజా క్యాబినెట్ సమావేశం అనంతరం మాత్రం లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం రాష్ట్రంలో అధికారిక లెక్కల ప్రకారం 5 లక్షలకు పైగా కరోనా కేసులున్నాయి. 4 లక్షల మంది కోలుకున్నారు. 3వేల వరకు మరణించారు. ఇంకా లక్ష మందికి పైగా చికిత్స పొందుతున్నారు. అయితే ప్రతి రోజూ వేల కేసులు కొత్తగా నమోదవుతున్నాయి. దీంతో ఆలోచనలో పడిన రాష్ట్ర సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.