దేశంలో విజృంభిస్తున్న కరోనాను అరికట్టాలంటే వ్యాక్సిన్ మాత్రమే ప్రస్తుతం మన ముందున్న ఏకైక మార్గం. కానీ ఈ వ్యాక్సిన్ల పంపిణీలో జరుగుతున్న ఆలస్యం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ సరిపడా వ్యాక్సిన్లు మాత్రం అందడం లేదు. రాష్ట్రాలు కోట్లలో వ్యాక్సిన్లు అడుగుతుంటే.. కేంద్రం నుంచి లక్షల్లో కూడా వ్యాక్సిన్లు అందడం లేదు. దీంతో ఆయా రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దీనివల్ల ఎన్నో విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఈ క్రమంలోనే కేరళ హైకోర్టు కేంద్రం విధానాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రానికి వెంటనే వ్యాక్సిన్లు అందించాలని ఆదేశించింది.
కేరళకు రావలసిన వ్యాక్సిన్లు ఇంకా అందలేదంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. తమకు వ్యాక్సిన్లు అందించకపోగా, దానిపై కేంద్ర ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆ పిటీషన్లో పేర్కొంది. 75 లక్షల కోవీషీల్డ్ డోసులను, 25 లక్షల కోవ్యాక్సిన్ డోసులను కలిపి మొత్తంగా కోటి డోసులను కోరినప్పటికీ తమకు కేవలం 3 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు మాత్రమే చేరాయని కేరళ ప్రభుత్వం ఆరోపించింది. ఈ ఆరోపణలు విచారణ చేపట్టిన హైకోర్టు కేంద్రాన్ని వివరణ కోరింది. అంతేకాకుండా కేరళ కోటా వ్యాక్సిన్ రాష్ట్రానికి ఎప్పుడు చేరుతుందో కూడా చెప్పాలని ఆదేశించింది.
దేశంలో ఏదైనా కొరత సంభవించే అవకాశాలు ఉన్నప్పుడు దానిని ఎదుర్కునేందుకు కేంద్రం సిద్ధంగా ఉండాలని, ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ విషయంలో ఆ పరిస్థితి కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై కేంద్రం త్వరగా చర్య తీసుకోవాలని ఆదేశించింది. వ్యాక్సిన్ డోసులు అయిపోతున్నాయన్న భయంతోనే ప్రజలు వ్యాక్సినేషన్ కేంద్రాల ముందు చేరుతున్నారని, ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్నారని, ఈ విషయంలో కేంద్రం త్వరగా తన సమాధానాన్ని తెలపాలని సూచించింది. తదుపరి విచారణను మే20కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.