దేశంలో పరిస్థితులను పట్టించుకోకుండా యోగా గురు రాందేవ్ బాబా వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లోపతి వైద్య విధానంపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని అన్నారు. ఈ మేరకు రాందేవ్‌కు ఆదివారం ఓ ఘాటు లేఖ రాశారు. రాందేవ్ బాబా వ్యాఖ్యలు కరోనా వారియర్స్ మనోభావాలను, దేశ ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసేలా ఉందని హర్షవర్ధన్ తన లేఖలో అభ్యంతరం వ్యక్తం చేశారు. కోవిడ్‌కు వ్యతిరేకంగా వైద్యులు నిద్రాహారాలు మాని, రేయింబవళ్లు శ్రమిస్తున్నారని, వారికి మద్దతునిస్తూ ఆరోగ్య కార్యకర్తలు కూడా సేవలు చేస్తున్నారని అన్నారు. కోవిడ్ కల్లోలంలో అల్లోపతి వైద్యులు అనేక లక్షల మంది ప్రాణాలను కాపాడారని, వారి వైద్య విధానంపై రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని కేంద్రమంత్రి ఆక్షేపించారు.
‘కోవిడ్‌ను సామూహికంగా మాత్రమే ఎదుర్కోగలం. దానికోసం వైద్యులు, ఇతర సిబ్బంది అహోరాత్రులూ కష్టపడి పనిచేస్తున్నారు. కోవిడ్ రోగులకు సేవ చేస్తూ వైద్యులతో పాటు ఇతర సిబ్బంది తమ ప్రాణాలను సైతం కోల్పోయారు. కోల్పోతున్నారు. ఇంతటి సేవ చేస్తున్న అల్లోపతి వైద్య విధానాన్ని తూలనాడుతూ రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం భావ్యం కాదు. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరి రేటు 88 శాతంగా ఉంది. మరణాల రేటు 1.13 శాతంగా ఉంది. ఇదంతా అల్లోపతి వైద్య విధానంతోనే సాధ్యమైంది. ఇలాంటి వ్యాఖ్యలు సమయం, సందర్భం మరిచిపోకూడదు. పరిస్థితులను బట్టి మాట్లాడాలి’ అని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు.
పోలియా, ఇబోలా, టీబీ లాంటి మహమ్మారి రోగాలకు అల్లోపతి వైద్యులే టీకాలను కనిపెట్టారనే విషయాన్ని మరిచిపోకూడదని, తాజాగా వచ్చిన మహమ్మారి కరోనాకు సంబంధించిన టీకా కూడా అల్లోపతి వైద్య విధానంలోనే కనిపెట్టడం జరిగిందని హర్షవర్ధన్ పేర్కొన్నారు. అందువల్ల అల్లోపతి వైద్యాన్ని తక్కువ చేయడం, తూలనాడడం తగదని హితవు పలికారు.
కాగా.. ఇటీవల రాందేవ్ బాబా అల్లోపతి వైద్యంపై సంచలన కామెంట్స్ చేసి విషయం తెలిసిందే. కరోనా కట్టడిలో అల్లోపతి విఫలమైందని, అదో పనికిమాలిన వైద్యమని, ఆ వైద్య విధానం పనిచేయకపోవడం వల్లనే ఇన్ని లక్షల ప్రాణాలు పోతున్నాయంటూ రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇటీవలే ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రానికి ఫిర్యాదు కూడా చేసింది. ఈ క్రమంలోనే ఆరోగ్య మంత్రి నుంచి ఈ లేఖ విడుదలైనట్లు తెలుస్తోంది.