పెళ్లంటే పందిళ్లు.. తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు… అంటారు పెద్దలు. కానీ ఇవన్నీ ఉన్నా, లేకపోయినా.. అమ్మాయి, అబ్బాయి మంచోళ్లై.. ఒకరినొకరు అర్థం చేసుకోగల వారైతే చాలంటున్నారు ఇప్పటి యువత. అయితే అర్థం చేసుకోవడం అటుంచితే.. ఈ మధ్య కాలంలో పెళ్లి పేరుతో.. ఒకరికి నలుగురిని మోసం చేసి.. వారిని దోచుకోవడం ఎక్కవైంది. ఇటీవల ఓ లేడీ కానిస్టేబుల్, అంతకుముందు ఓ యువకుడు ఇలా నలుగురైదుగురిని పెళ్లి చేసుకుని.. ఆ తర్వాత నెమ్మదిగా వారిని లక్షలు దోచి ఎగిరిపోయవడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో జరిగింది.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని బాప్ సిటీలో ఉపేంద్ర(22) తల్లిదండ్రులతో కలిసి నివశిస్తున్నాడు. ఈ మధ్యనే పెద్దల సమక్షంలో శాలిని(20)ని వైభవంగా పెళ్లి కూడా చేసుకున్నాడు. కొత్త కోడలు అటు అత్తమామలతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడేది. భర్తతో ఎంతో ప్రేమగా ఉండేది. దీంతో తమకు తగ్గ కోడలు దొరికిందని పెద్దలు, హమ్మయ్య మంచి భార్య దొరిందని ఉపేంద్ర సంతోషించారు. కానీ మూడు వారాలు కూడా పూర్తి కాకముందే.. శాలిని తన అసలు రంగు బయటపెట్టింది. కట్టుకున్న భర్తకు, అత్తింటివారికి మత్తు మందు ఇచ్చిన కొత్త కోడలు పట్టుచీరలు, నగలతో పరారైంది. గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది.
సోమవారం రాత్రి శాలిని తనకు, తన తల్లిదండ్రులకు పాలల్లో మత్తు మందు కలిపి ఇచ్చినట్లు ఉపేంద్ర పోలీసులకు చెప్పాడు. తామంతా ఆ పాలు తాగి మత్తులోకి జారుకోగానే ఇంట్లో విలువైన నగలు, బట్టలు తీసుకుని అక్కడినుంచి వెళ్లిపోయిందని ఫిర్యాదు చేశాడు. ‘ఉదయం నిద్ర లేచి చూసేసరికి ఇంట్లో శాలిని కనిపించలేదు. దీంతో తాను, తన తల్లిదండ్రులు చట్టుపక్కల వెతికాం. అయినా ఆమె జాడ తెలియలేదు. అనుమానం వచ్చి ఇంట్లోని బీరువా తీసి చూడగా అందులోని విలువైన నగలు, చీరలు మాయమయ్యాయి. దాంతో శాలిని ఈ పని చేసిందని భావించి పోలీసులను ఆశ్రయించాం’ అని ఉపేంద్ర తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇదిలా ఉంటే ఉపేంద్ర, అతడి తల్లిందండ్రులే ఏమైనా చేసి ఉంటారా..? అనే కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే వారిని దీనిపై పోలీసులు ప్రశ్నించినట్లు కూడా తెలుస్తోంది. మరి ఈ స్టోరీకి ఫుల్ స్టాప్ ఎలా పడుతుందో చూడాలి.