టీమిండియా ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. లివర్ క్యాన్సర్‌తో పోరాడుతూ భువీ తండ్రి కిరణ్ పాల్ సింగ్(63) గురువారం సాయంత్రం కన్నుముశారు. ఆయన కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో కీమోథెరపీ చికిత్స కూడా చేయించుకుని ఇటీవలే ఇంటికి తిరిగొచ్చారు. అనంతరం మళ్లీ ఆరోగ్యం క్షీణించడంతో 2 వారాల క్రితం మీరట్ గంగానగర్‌లోని ఆసుపత్రిలో చేర్పించారు. 2 రోజుల క్రితమే అక్కడి నుంచి డిశ్చార్జి కూడా అయ్యారు. అయితే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రెండు రోజులకే ఆయన తుదిశ్వాస విడిచాడు.
ఉత్తరప్రదేశ్ పోలీస్ శాఖలో ఎస్సైగా పనిచేసిన కిరణ్ పాల్.. స్వచ్ఛందంగా పదవీ విరమణ తీసుకున్నారు. గతేడాది సెప్టెంబరులో ఆయనకు కేన్సర్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఆ సమయంలో భువనేశ్వర్ యూఏఈలో ఐపీఎల్ ఆడుతున్నాడు. అయితే అప్పుడు భువీ రాలేకపోయాడు. కుటుంబ సభ్యులే ఆయనను ఆసుపత్రిలో చేర్చించి చికిత్స ఇప్పించారు. భువి తిరిగొచ్చే సమయానికి కోలుకుని బయటకొచ్చారు. అయితే ఇటీవల మళ్లీ అనారోగ్యం బారిన పడడంతో భువీ దగ్గరుండి ఆయనను చూసుకున్నాడు. ఆసుపత్రిలో జాయిన్ చేయగా కోలుకుని తిరిగొచ్చారు. అయితే కేవలం 2 రోజుల వ్యవధిలోనే ఆయన మరణించారు. దీంతో కుటుంబం ప్రస్తుతం తీవ్ర ఆవేదనలో ఉంది.
కాగా.. గత కొంత కాలంగా గాయాలతో సతమతమవుతున్న భువీ.. మనుపటి ఫామ్‌ని అందుకోలేకపోతున్నాడు. దీంతో ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నాడు. ఇటీవల ఎంపిక చేసిన ఇంగ్లండ్ టూర్‌లో కూడా భువీకి చోటు దక్కలేదు. ఈ పర్యటనలో భారత్ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌తోపాటు ఇంగ్లండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడుతుంది. అయితే, జులైలో శ్రీలంకతో జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్‌లో భువీ ఆడే అవకాశం ఉంది.