కరోనా మహమ్మారితో దేశం మొత్తం ఓ పక్క అల్లకల్లోలం అవుతుంటే.. మరో పక్క బ్లాక్ ఫంగస్ భూతం పెను సవాల్‌గా మారింది. కరోనా నుంచి కోలుకున్నా.. ఈ మహమ్మారి బారిన పడి దివ్యాంగులుగా మారుతున్నారు. మరికొంత మంది మెడిసిన్ కొరతతో ప్రాణాలే కోల్పోతున్నారు. ఈ రెండింటితోనే ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతుంటే తాజాగా మరో దారుణ ఫంగస్ వెలుగులోకొచ్చింది. అదే వైట్ ఫంగస్. బ్లాక్ ఫంగస్ కన్నా ప్రమాదకరమైన ఈ వైట్ ఫంగస్ కేసులు పాట్నాలో నమోదయ్యాయి. ఈ వైట్ ఫంగస్ కేసులు ఇప్పటి వరకు పాట్నాలో 4 నమోదయ్యాయి. దీని బారిన పడిన వారిలో ఓ ప్రముఖ డాక్టర్ ఉండటం అందరినీ మరింత భయపెడుతోంది. అయితే బాధితులంతా చికిత్స చేయడం ద్వారా తగ్గించామని వైద్యులు తెలిపారు.
ఈ వైట్ ఫంగస్‌కు సంబంధించి పీఎంసీహెచ్‌కు చెందిన మైక్రోబయాలజీ డిపార్ట్‌మెంట్ హెడ్ డాక్టర్ ఎస్ఎన్ సింగ్ అనేక విషయాలను వెల్లడించారు.
ఇప్పటి వరకు పాట్నాలో 4 కేసులు బయటపడ్డాయని, ఇంకా ఎంతమంది దీని బారిన పడ్డారో తెలియాల్సి ఉందని అన్నారు. అయితే దీని లక్షణాలు కరోనాను పోలి ఉన్నాయని, కానీ ఇది కరోనా కాదని ఆయన తెలిపారు. దీని బారిన పడిన వారికి అన్ని రకాల కరోనా పరీక్షలు చేయించామని, అన్నింటిలోనూ నెగిటివ్‌గా రిపోర్టే వచ్చిందని చెప్పారు. అంతేకాకుండా యాంటీ ఫంగల్ ఔషధాలను ఇవ్వడంతో ఇది తగ్గిందని, దాంతో దీనిని గుర్తించామని చెప్పారు. అయితే ఈ వైట్ ఫంగస్ యాంటీ ఫంగల్ మెడిసిన్‌తోనే తగ్గడం అదృష్టమని పేర్కొన్నారు.
‘ఎక్కువగా స్టెరాయిడ్లు వాడేవారికి, బలహీనంగా ఉండే వారికి, రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి, మధుమేహ రోగులు దీని బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంది. బ్లాక్ ఫంగస్‌తో పోలిస్తే వైట్ ఫంగస్ చాలా ప్రమాదకరం. వైట్ ఫంగస్ సోకిన వారి ఊపిరితిత్తులు, చర్మం, గోళ్లు, మూత్రపిండాలు, మెదడు, మర్మావయవాలు, నోరు, కడుపు అన్ని ప్రభావితం అవుతున్నాయి. అయితే ఊపిరితిత్తులపై వైట్ ఫంగస్ ప్రభావాన్ని హెచ్ఆర్‌సీటీ పరీక్ష ద్వారా కనుక్కోవచ్చు. అంతేకాకుండా కరోనా వంటి వ్యాధుల లక్షణాలను కేవలం హెచ్ఆర్‌సీటీ ద్వారా తెలుసుకోవచ్చు. కానీ వైట్ ఫంగస్‌కు మాత్రం మ్యూకస్(శ్లేష్మం) కల్చర్‌ను పరీక్షించాల్సి ఉంటుంద’ని డాక్టర్ సింగ్ వెల్లడించారు.