టీమిండియా యువ కెరటం, వికెట్ కీపర్ రిషబ్ పంత్‌పై భారత మాజీ క్రికెటర్ సబా కరీం ప్రశంసల వర్షం కురిపించాడు. టీమిండియా టెస్ట్ జట్టు ఇంత పటిష్ఠంగా తయారుకావడానికి అతడే కారణం అంటూ అభినందించాడు. వేగంగా పరుగులు రాబట్టడం, ప్రత్యర్థిని తన దూకుడుతో భయపెట్టటం వంటి లక్షణాలే పంత్‌ను గొప్ప బ్యాట్స్‌మన్‌గా మారుస్తున్నాయని, కీపర్‌గా, బ్యాట్స్‌మన్‌గా అతడు జట్టులోకొచ్చినప్పటి నుంచి జట్టు కూర్పు బాగుంటోందని సబాం కరీం చెప్పుకొచ్చాడు.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు భారత్ చేరడంలో కెప్టెన్ విరాట్ కోహ్లి, ఛతేశ్వర్ పూజారా, బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా కీలకపాత్ర పోషించారనడంలో ఎలాంటి సందేహం లేదని, కానీ టీమిండియా యువ ఆటగాడు రిషభ్ పంత్ అతి ముఖ్యమైన పాత్ర పోషించడం వల్లే భారత్ పటిష్ఠంగా తయారైందని కరీం అభిప్రాయపడ్డాడు.
‘పంత్ టెస్టు జట్టులోకి వచ్చినప్పటి నుంచి జట్టు కూర్పు చాలా బాగుంది. పంత్ ఆరోస్థానంలో బ్యాటింగ్‌కు దిగడం వల్ల కెప్టెన్‌కు, జట్టుకు ఎంతో కలిసొస్తోంది. ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. అనంతరం ఇంగ్లాండ్‌తో భారత్ 5 టెస్టులు ఆడుతుంది. ఈ మ్యాచ్‌ల్లో రిషభ్ పంత్ మంచి ప్రదర్శన చేయాలి. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్స్ చేరడంలో పంత్ ముఖ్యభూమిక పోషించిన విషయాన్ని మనం మార్చిపోకూడదం’టూ కరీం పేర్కొన్నాడు.
కాగా.. ఐసీసీ తొలి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్స్ సౌథాంప్టన్ వేదికగా జూన్ 18-22 మధ్య జరిగనుంది. ఈ చారిత్రాత్మక పోరులో భారత్‌ను న్యూజిలాండ్ ఢీ కొట్టనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ అందుకున్న తొలి జట్టుగా చరిత్ర సృష్టిస్తుంది.