ప్రపంచ టెస్ట్ ఛాంపియషిప్ ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో జరిగే ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం భారత జట్టు జూన్ 2న ప్రత్యేక విమానంలో యూకేకు బయల్దేరనుంది. దీనికోసం ఇప్పటికే ఇప్పటికే జట్టు సభ్యులతో పాటు వారివారి కుటుంబ సభ్యులు, సహాయ సిబ్బంది ముంబైలో క్వారంటైన్ లో ఉన్నారు. ఇక ఈ క్రమంలోనే టీమిండియా డాషింగ్ బ్యాట్స్ మెన్, వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు లెజెడరీ క్రికెటర్ కపిల్ దేవ్ ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఇంగ్లీష్ గడ్డపై దూకుడు తగ్గించుకొని బ్యాటింగ్ చేయాలని, ప్రతి బంతిని బాదడానికి ప్రయత్నించకూడదని, క్రీజులో ఎక్కువ సమయం గడిపేలా ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
ఇటీవల ఓ జాతీయ పత్రికకు కపిల్ దేవ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సందర్భంగానే పంత్ గురించి ప్రస్తావించారు. గతంతో పోలిస్తే పంత్ ప్రస్తుతం చాలా పరిణితి చెందాడని, దానికి అతడి నిలకడైన ఆటే నిదర్శనమని చెప్పుకొచ్చారు. అయితే అతని సహజ సిద్దమైన ఆటతీరుకి ఇంగ్లండ్‌లో పరిస్థితులు అనుకూలించకపోవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఇంగ్లండ్ పిచ్‌లపై ప్రతి బంతిని బాదాలని ప్రయత్నించకూడదని, క్రీజ్‌లో ఎక్కువ సమయం గడిపితే పరుగులు వాటంతట అవే వస్తాయని అన్నారు. ఇంగ్లండ్ పర్యటనలో పంత్ ఈ ప్రణాళికను అమలుచేయకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
ఇదే సమయంలో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ గురించి కూడా కపిల్ ప్రస్తావించారు. రోహిత్ కూడా పంత్ లాగే ప్రతి బంతిని బలంగా బాదాలనుకునేవాడని, అందుకే అప్పట్లో అతడికి కూడా ఇదే సలహా ఇచ్చానని, ఈ సలహాను పాటించడం వల్ల అతను సత్ఫలితాలు సాధించాడని పేర్కొన్నారు. రోహిత్ లాగే పంత్ కూడా చాలా తెలివైన, విలువైన ఆటగాడని, తాను చెప్పిన ఫార్ములాను ఇంగ్లండ్ గడ్డపై అమలు చేస్తాడనే అనుకుంటున్నానని అన్నారు. అలా చేస్తే టీమిండియాలో అతడు మరింత కీలక ఆటగాడిగా నిలుస్తాడని అభిప్రాయపడ్డారు.