మనిషి ఎంత సాధించినా ప్రకృతి ముందు మాత్రం గెలవలేడు. తుఫానులు, భూకంపాలు వంటి ప్రమాదాలను ఆపలేడు. నష్టాన్ని తగ్గించుకోగలడేమో కానీ.. దాని నుంచి పూర్తిగా తప్పించుకోలేడు. ఇటీవల వచ్చిన తౌక్తే తుఫాను కానీ, ఇప్పుడు రాబోతున్న యాస తుపాను కానీ.. ఇంతకుముందు వచ్చిన అనేక తుఫానులు కానీ ఈ విషయాన్ని తేల్చి చెబుతున్నాయి. ఈ తుఫానుల వల్ల ఏటా అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా అరేబియా సముద్రంలో తౌక్తే తుఫాను విజృంభించిన విషయం తెలిసిందే.
తౌక్తే తుఫాను కారణంగా ఎన్నో నౌకలు సముద్రంలో మునిగిపోయాయి. తీరంలో అనేక భవనాలు నిట్టనిలువుగా కూలిపోయాయి. ఎంతోమంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కాగా.. ఈ రాకాసి తుఫానుకు బలైన ఓ పడవకు సంబంధించి తాజాగా ఓ వీడియో బయటకొచ్చింది. తుఫాను కల్లోలంలో చిక్కుకుని రాకాసి అలల తాకిడికి అల్లాడిపోతున్న ఓ పడవకు సంబంధించిన వీడియో ఇది. తుఫానులో పడవ చిక్కుకున్న సమయంలో ఎవరో దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే దురదృష్టవశాత్తూ ఈ వీడియో తీసిన కొద్ది సేపటికి ఆ పడవ సముద్ర గర్భంలో కలిసిపోయింది. అందులోని సిబ్బంది కూడా చనిపోయారు. కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే సరైన సమయంలో పడవ నుంచి సముద్రంలోకి దూకేసి ప్రాణాలు దక్కించుకోగలిగారు.
ఈ వీడియోను ప్రముఖ జర్నలిస్ట్ నయానిమా బసు తన ట్విటర్ ఖాతాలో షేర్ చేయడంతో విపరీతంగా వైరల్ అవుతోంది. వరప్రద అనే ఆ పడవలో మొత్తం 13 మంది సభ్యులు సముద్రంలోకి వెళ్లారు. గత సోమవారం సాయంత్రం సమయంలో మహారాష్ట్ర సరిహద్దుల్లో ఈ పడవ నీట మునిగింది. పడవ మునిగిపోతుండడంతో అంతా నీటిలో దూకేశారు. కానీ.. నేవీ అధికారులు అక్కడకు చేరుకుని వారిని రక్షించే సమయానికి 11 మంది మరణించారు. కేవలం ఇద్దరు ప్రాణాలతో మిగిలారు. వారిని అధికారులు రక్షించి ఒడ్డుకు తీసుకొచ్చారు.