కరోనా దెబ్బకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్ నిలిచిపోయింది. దీంతో ఆటగాళ్లంతా ఇళ్లకు వెళ్లిపోయారు. ఫ్రాంచైజీలు ప్రత్యేక విమానాల్లో వారిని వారి వారి స్వస్థలాలకు చేర్చింది. విదేశీయులు కూడా భారత్ నుంచి దాదాపు వెళ్లిపోయారు. ఇక భారత ఆటగాళ్లు ఇళ్లకు చేరుకున్నారు. అయితే మిగతా అందరి విషయం ఏమో కానీ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం ఐపీఎల్ నుంచి తిరిగి రాగానే కరోనా బాధితులకు సాయం చేసేందుకు పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్ ప్రారంభించాడు. ఇందులో అతడి భార్య అనుష్క శర్మ కూడా కోహ్లీతో పాటు క్యాంపెయినింగ్ చేస్తోంది. దేశంలో కరోనా విలయ తాండవం చేస్తోందని, ఇలాంటి సమయంలో విరాళాల సేకరణ కోసం ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు విరుష్క దంపతులు ప్రకటించారు.
దేశంలో ప్రజల బాధలు చూసి తీవ్ర ఆవేదన కలిగిందని విరాట్ చెప్పుకొచ్చాడు. అందుకే వారి భాధను పంచుకునే బాధ్యతను అనుష్కతో కలిసి తీసుకోవాలని భావిస్తున్నానని, వైరస్‌పై పోరాటాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పాడు. కష్టకాలంలో కరోనాపై పోరాడుతున్న వారికి అండగా ఉందామని తన ఫ్యాన్స్‌కు, ప్రజలకు పిలుపునిచ్చాడు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని విరుష్క దంపతులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
‘కరోనా రెండో దశ విజృంభణపై దేశం పోరాటం చేస్తోంది. వైద్యారోగ్య వ్యవస్థ పెను సవాళ్లను ఎదుర్కొంటోంది. దేశంలో ప్రజల బాధలు చూసి తీవ్ర ఆవేదన కలిగింది. కోహ్లీ, నేను కలిసి విరాళాల సేకరణ చేపడుతున్నాం. మనమందరం కలిసి ఈ సంక్షోభాన్ని అధిగమించాలి. దేశానికి, భారతీయులకు మద్దతు ఇవ్వడానికి ముందడుగు వేయండి. మీరు అందించే సహకారం ఈ క్లిష్ట సమయంలో ప్రజల ప్రాణాలను రక్షించడంలో సహాయపడుతుంది’ అని అనుష్క చెప్పుకొచ్చింది.
‘ketto’ వెబ్‌సైట్ ద్వారా విరాళాలు సమీకరించనున్నట్లు ఆ వీడియో ద్వారా వెల్లడించారు. అంతేకాకుండా మొదటి విరాళంగా తామిద్దరూ కలిసి రూ.2 కోట్లు విరాళంగా ఇస్తున్నామని, దీని ద్వారా ఈ క్యాంపెయినింగ్ ప్రారంభిస్తున్నామని తెలిపారు. అయితే మొత్తంగా రూ.7 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.