ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు ముందు టీమిండియా కెప్టెన్, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గాయపడ్డాడనే వార్తలు ఇప్పుడు జోరుగా వినిపిస్తున్నాయి. దీంతో భారత క్రికెట్ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. గురువారం నెట్ ప్రాక్టీస్ సందర్భంగా విరాట్ కోహ్లీ గాయపడినట్లు సమాచారం. నెట్స్‌లో పేసర్ మహ్మద్ షమీ విసిరిన బౌన్సర్ కోహ్లీ పక్కటెముకలకు నేరుగా తగిలిందని, దాంతో అతడికి తీవ్ర గాయమైందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ గాయం కారణంగా కోహ్లీ.. 3 నుంచి 6 వారాల పాటు క్రికెట్‌కు దూరం కావాల్సి వస్తుందని కూడా జాతీయ మీడియాలో ప్రచారం సాగుతోంది. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్ వంటి ప్రతిష్ఠాత్మకమైన మ్యాచ్ ముందు కోహ్లీకి గాయం కావడం ఇప్పుడు టీమిండియా క్రికెట్లో ఆందోళన కలిగిస్తోంది. అయితే దీనిపై ఇప్పటి వరకూ బీసీసీఐ నుంచి కానీ, టీమిండియా మేనేజ్‌మెంట్ నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.
ఇదిలా ఉంటే.. ఒకవేళ కోహ్లీకి నిజంగా గాయమైతే టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బేనని క్రికెట్ పండితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2 రోజులుగా టీమిండియా సభ్యులంతా కలిసి ప్రాక్టీస్ చేస్తున్న నేపథ్యంలో గురువారం కోహ్లీ, షమీతో పాటు బుమ్రా, గిల్, ఇషాంత్, పుజారాలు నెట్స్‌లో చెమటోడ్చారు. ఈ నెల 18 నుంచి భారత్, న్యూజిలాండ్‌ల మధ్య డబ్యూటీసీ ఫైనల్ ప్రారంభం కానుండగా.. టీమిండియా ఆటగాళ్లు ప్రిపరేషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఫైనల్‌కు ముందు ఎటువంటి ప్రాక్టీస్ మ్యాచ్ లేకపోవడంతో ఆటగాళ్లంతా నెట్స్‌లోనే తీవ్రంగా చెమటోడుస్తున్నారు. మరోవైపు సౌతాంప్టన్‌లోని వాతావరణానికి కూడా అలవాటు పడేందుకు టీమిండియా సభ్యులు గ్రౌండ్‌లోనే గడుపుతున్నారు.