టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి మరో మాజీ క్రికెటర్ షాకిచ్చాడు. తన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ జట్టులో కోహ్లీకి స్థానం కల్పించకుండా అందరినీ ఆశ్చర్యపరిచాడు.
ఇటీవల జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఓడిన తరువాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై వివిధ దేశాల మాజీ క్రికెటర్లు పూర్తి వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారు. తమ అత్యుత్తమ డబ్ల్యూటీసీ జట్టులో కనీసం చోటు కూడా ఇవ్వకుండా షాకులిస్తున్నారు.
తొలుత టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా తన డ్రీమ్ జట్టులో కోహ్లీకి స్థానమివ్వకుండా ఓ జట్టును ప్రకటించాడు.
తాజాగా ఆసీస్ మాజీ ఆటగాడు, దిగ్గజ చైనామెన్ బౌలర్ బ్రాడ్ హాగ్ తన అత్యుత్తమ జట్టులో కోహ్లీకి స్థానం ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పాడు.
తన జట్టులో నలుగురు భారత ప్లేయర్లకు అవకాశం కల్పించిన హాగ్.. ఆశ్చర్యకరంగా కోహ్లీని పరిగణలోకి కూడా తీసుకోలేదు.
ఓపెనర్లుగా రోహిత్ శర్మ, దిముత్ కరుణరత్నేను తీసుకున్నాడు. ఫస్ట్ డౌన్‌లో కేన్ విలియమ్సన్‌ను ఎంపిక చేసి అతడినే తన జట్టు కెప్టెన్‌గా ఎన్నుకున్నాడు.
టెస్ట్‌ల్లో కోహ్లీ స్థానమైన నాలుగో స్థానాన్నిఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్‌తో భర్తీ చేశాడు. ఇక ఐదో స్థానం కోసం పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్‌ను ఎంపిక చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌కు ఆరో స్థానాన్ని, టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్‌ను ఏడో స్థానానికి ఎంపిక చేశాడు.
8వ స్థానంలో ఏకైక స్పిన్నర్‌గా భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను తీసుకున్న హాగ్.. 9వ స్థానానికి కివీస్ పేసర్.. కైల్ జెమీసన్‌ను ఎంపిక చేశాడు.
ఇంగ్లండ్ వెటరన్ స్టువర్ట్ బ్రాడ్, టీమిండియా పేసర్ మహమ్మద్ షమీలను అతని సహచర పేసర్లుగా ఎంపిక చేశాడు.
హాగ్ డ్రీమ్ డబ్ల్యూటీసీ జట్టు:
రోహిత్ శర్మ, దిముత్ కరుణరత్నే, కేన్ విలియమ్సన్(కెప్టెన్), స్టీవ్ స్మిత్, బాబర్ ఆజామ్, బెన్ స్టోక్స్, రిషబ్ పంత్, కైల్ జేమీసన్, రవిచంద్రన్ అశ్విన్, స్టువర్ట్ బ్రాడ్, మహమ్మద్ షమీ.