తెలంగాణలో లాక్‌డౌన్ ఉండబోదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. లాక్‌డౌన్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, ఇతర రాష్ట్రాలే దీనికి ఉదాహరణ అని కేసీఆర్ అన్నారు. కరోనా పరిస్థితులపై గురువారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్షను సీఎం నిర్వహించారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి, సీఎంవో, ఇతర అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగంగానే కేసీఆర్ లాక్‌డౌన్‌ను వ్యతిరేకించారు. ‘లాక్‌డౌన్ వల్ల ప్రజాజీవనం స్తంభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. పేద బతుకులు ఆకలితో అలమటించిపోతాయి. అంతేకాకుండా గత అనుభవాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించినా కూడా పాజిటివ్ కేసులు తగ్గడం లేదనే విషయాన్ని పరిశీలించే ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రజలు స్వచ్ఛందంగా కరోనా మీద యుద్ధంలో భాగస్వాములు కావాలి. అందరం కలిసి యుద్ధం చేస్తేనే దీనిని అంతం చేయగలుగుతాం’ అని కేసీఆర్ అన్నారు.
అలాగే రెండో దశ కరోనా తీవ్రత మే 15 తర్వాత తగ్గిపోతుందని నివేదికలు సూచిస్తున్నాయని, అయినా అశ్రద్ధ వహించకుండా ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందించే మెడికల్ కిట్లను వినియోగించుకోవాలని సూచించారు. వీటిని ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంల ద్వారా ఇంటింటికీ అందజేస్తామన్నారు. అనంతరం అధికారులకు కూడా అనేక సూచనలు చేశారు. తక్షణమే 500 ఆక్సిజన్ వృద్ధి యంత్రాలను (ఎన్‌రిచర్లను) కొనుగోలు చేయాలని, వైద్యశాఖకు అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ఆయన ఆదేశించారు.
‘రాష్ట్రంలో ప్రస్తుతం 9,500 ఆక్సిజన్ పడకలున్నాయి. హైదరాబాద్, ఇతర జిల్లాల్లో వారం రోజుల్లో మరో 500 పడకలు సమకూర్చాలి. మెరుగైన ఆక్సిజన్ సరఫరా కోసం ఒక్కో దానికి రూ.కోటి చొప్పున 12 క్రయోజనిక్ ట్యాంకర్లను కొనుగోలు చేసి.. చైనా నుంచి వాయు మార్గంలో అత్యవసరంగా దిగుమతి చేసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రులు, ప్రాథ]మిక ఆరోగ్య కేంద్రాల్లో మొత్తం 5,980 కరోనా అవుట్‌పేషెంట్ సెంటర్లు ఏర్పాటు చేశాం. వీటిని ప్రజలు ఉపయోగించుకోవాలి. కరోనా పరిస్థితిపై ప్రతిరోజూ సాయంత్రం వైద్య అధికారులు మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించాలి. ఈ బాధ్యత ఆరోగ్యశాఖ సంచాలకుడు తీసుకోవాల’ని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
ఇక రాష్ట్రంలో ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ లభ్యతపై సీఎం అధికారులను ప్రశ్నించారు. రెమ్‌డెసివిర్ తయారీ సంస్థలకు అక్కడే ఫోన్ చేసి మాట్లాడారు. వాటి ఉత్పత్తి, లభ్యతను మరింతగా పెంచాలని కోరారు. ఐఐసీటీ సంచాలకుడు చంద్రశేఖర్‌తోనూ ఆక్సిజన్ అవసరాల గురించి ఫోన్లో సంభాషించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు.