తమిళనాడులో దశాబ్దం తరువాత కొత్త ప్రభుత్వం ఏర్పడింది. రాష్ట్రానికి కొత్త సీఎంగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రిగా నేడు(శుక్రవారం) ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. స్టాలిన్‌తో గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ప్రమాణ స్వీకారం చేయించారు. కరోనా మహమ్మారి కారణంగా అట్టహాసాలేమీ లేకుండా సాదాసీదాగా కార్యక్రమం ముగిసింది. ముఖ్యమైన అతిథులను మాత్రమే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు.
కాగా.. బుధవారం కొత్తగా ఎన్నికైన డీఎంకే శాసనసభ్యుల సమావేశం ఆ పార్టీ ప్రధాన కార్యాలయమైన అన్నా అరివాయంలో జరిగింది. ఇందులో శాసనసభాపక్ష నేతగా ఎంకే స్టాలిన్‌ను ఎన్నుకున్నారు. ఆ తర్వాత రాష్ట్ర గవర్నరును స్టాలిన్ రాజ్‌భవన్‌లో కలుసుకుని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. ఆయన వెంట పార్టీ సీనియర్ నేతలు ఉన్నారు. గవర్నర్ ఆహ్వానించడంతో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం నిర్వహించారు.
ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 234 స్థానాలకు ఎన్నికలు జరగగా డీఎంకే కూటమి 156 సీట్లలో విజయం సాధించి అధికారన్ని చేజిక్కించుకుంది. ప్రత్యర్థి అన్నాడీఎంకే కూటమికి 78 సీట్లు మాత్రమే లభించాయి.
క్యాబినెట్‌లో స్టాలిన్ మార్క్:
ప్రమాణ స్వీకారం అనంతరం ముఖ్యమంత్రి స్టాలిన్ తన మంత్రి మండలి కేబినెట్‌ను ప్రకటించారు. మొత్తం 34 మందికి అందులో చోటు కల్పించారు. గతంలో డీఎంకే ప్రభుత్వ హయాంలో మంత్రులుగా వ్యవహరించిన వారితోపాటూ కొత్త వారికి కూడా స్టాలిన్ అవకాశం ఇవ్వడం కొసమెరుపు.
కొత్త మంత్రులు వీరే:
దురైమురుగన్, కేఎన్. నెహ్రూ, ఐ పెరియస్వామి, పొన్ముడి, వేలు, ఎంఆర్‌కే పన్నీర్‌సెల్వం, కేకేఎస్‌ఆర్ రామచంద్రన్, తంగం తెన్నరసు, రఘుపతి, ముత్తుస్వామి, పెరయకుప్పన్, టీఎం అన్బరసన్, ఎంపీ స్వామినాథన్, గీతా జీవన్, అనితా రాధాకృష్ణన్, రాజకన్నప్పన్, కే రామచంద్రన్, చక్రపాణి, వీ సెంథిల్ బాలాజీ, ఆర్ గాంధీ, ఎం సుబ్రమణియన్, పీ మూర్తి, ఎస్‌ఎస్ శివశంకర్, పీకే శేఖర్‌బాబు, పళనివేల్ త్యాగరాజన్, ఎస్‌ఎం నాజర్, సెంజీ కేఎస్ మస్తాన్, అన్బిల్ మహేష్ పొయ్యామొళి, ఎస్‌వీ గణేశన్, మనో తంగరాజ్, మదివేందన్, కయల్‌విళి సెల్వరాజ్‌లు స్టాలిన్ మంత్రి వర్గంలో స్థానం సంపాదించారు.