మీరు ఈ మధ్యనే కరోనా బారిన పడ్డారా..? వైద్యుల సాయంతో, సొంత జాగ్రత్తలతో పూర్తిగా కోలుకున్నారా..? అయితే మంచిది. కానీ కోలుకున్న తరువాత కూడా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. వాటిలో మొదటిది మీ టూత్ బ్రష్ మార్చడం. అవును.. ఆశ్చర్యంగా ఉన్నా.. వైద్య నిపుణులు సూచిస్తున్న విషయమిది. టూత్ బ్రష్, టంగ్ క్లీనర్ల ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందుతుందని నిపుణులు హెచ్చరించారు. అందుకే కరోనా నుంచి కోలుకున్న వెంటనే టూత్ బ్రష్, టంగ్ క్లీనర్‌ను మార్చాలని, లేకపోతే మళ్లీ వాటి ద్వారా కరోనా శరీరంలోకి ప్రవేశించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
‘కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి వెంటనే టూత్ బ్రష్, టంగ్ క్లీనర్లను తప్పనిసరిగా మార్చాలి. వాటిని మార్చడం వల్ల వ్యక్తి తిరిగి కరోనా బారిన పడే అవకాశం ఉండదు. ఇంట్లో అదే వాష్ రూంను ఉపయోగించే ఇతరులను కూడా కాపాడవచ్చు. మీరు, మీ కుటుంబసభ్యులు, స్నేహితులు ఎవరైనా కరోనా నుంచి కోలుకున్న తరువాత వెంటనే వారు వాడిన టూత్ బ్రష్, టంగ్ క్లీనర్లను మార్చేయాలి. బాత్‌రూం నుంచి కూడా వారిని తొలగించండి. సదరు రోగి కరోనా బారిన పడినప్పుడు వినియోగించిన, లేదా కరోనా నిర్ధారణ అయ్యేవరకు వినియోగించిన వాటిల్లో కూడా కరోనా వైరస్ ఉంటుంది. ముఖ్యంగా నోటిలో పెట్టుకునే టూత్ బ్రష్, టంగ్ క్లీనర్లలో కరోనా ఉండే ప్రమాదం ఉంది. ఇవి వైరస్‌ను వ్యాప్తి చేస్తాయ’ని న్యూఢిల్లీ లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీ డెంటల్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ ప్రవేష్ మెహ్రా పేర్కొన్నారు.
అంతేకాకుండా.. కరోనా మాత్రమే కాదని, ఇతర ఫ్లూ, దగ్గు, జలుబు నుంచి కోలుకున్న వారెవరైనా టూత్ బ్రష్, టంగ్ క్లీనర్లను మార్చాలని డాక్టర్ భూమికా మదన్ చెప్పారు. ‘టూత్ బ్రష్ మీద కాలక్రమేణా ఏర్పడిన బాక్టీరియా, వైరస్ శ్వాసకోశ అంటువ్యాధులకు కారణమవుతుంది. నోటిలో వైరస్ పెరుగుదలను నియంత్రించేందుకు బీటాడిన్ గార్గ్‌లే లేదా మౌత్ వాష్ వినియోగించండి. మౌత్ వాష్ అందుబాటులో లేకపోతే వెచ్చని సెలైన్ వాటర్‌తో నోటిని శుభ్రం చేసుకున్నా సరిపోతుంద’ని డాక్టర్ భూమికా తెలిపారు.