తమిళనాడులో ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు కూడా వచ్చేశాయి. డీఎంకే కూటమి బంపర్ మెజార్టీతో విజయం సాధించింది. నేడు డీఎంకే అధినేత స్టాలిన్ సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా పూర్తయింది. అయితే ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత అందరికంటే ఎక్కువగా ఆశ్చర్యం కలిగించిన పార్టీ ఏదైనా ఉంటే అది కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం(ఎంఎన్‌ఎం) పార్టీనే. ఒక్క సీటు కూడా ఆ పార్టీ దక్కించుకోలేకపోయింది. కనీసం కమల్ హాసన్ కూడా తన నియోజకవర్గంలో గెలుపొందలేకపోయారు. దీంతో ఆ పార్టీ నుంచి వలసలు మొదలైపోయాయి. మరి కొంత మంది స్వచ్ఛందంగా పార్టీని వెళ్లిపోతుండగా.. ఇంకొంతమంది రాజీనామాలు ప్రకటించడమే కాకుండా పార్టీ విధానాలను కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు.
ఎన్నికల్లో పరాభవం నేపథ్యంలో ఇప్పటికే పలువురు పార్టీని వీడగా.. తాజాగా పార్టీ ఉపాధ్యక్షుడు ఆర్ మహేంద్రన్ సైతం రాజీనామా సమర్పించారు. ఈ మేరకు ఆయన పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్‌కు పలు కారణాలను వివరిస్తూ ఓ లేఖ కూడా రాశారు. ఆ లేఖలో పార్టీపై మహేంద్రన్ పలు ఆరోపణలు చేశారు. పార్టీలో కొందరు సలహాదారులు కమల్‌ను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. అలాగే కమల్ పార్టీ నడిపే తీరు కూడా ప్రజాస్వామ్యయుతంగా లేదన్నారు. పార్టీలో ‘విభజించు-పాలించు’ విధానం అమల్లో ఉందని ఆరోపించారు.
ఈ క్రమంలోనుే మహేంద్రన్ రాజీనామాపై కమల్ హాసన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన్ను ‘ద్రోహి’గా అభివర్ణించారు. మహేంద్రన్ రాజీనామా చేయకపోయినా పార్టీ నుంచి తామే తొలగించేవారమని తెలిపారు. పార్టీ నుంచి ఓ ‘కలుపు మొక్క’ బయటకు వెళ్లిందని.. దానికి తాము హర్షిస్తున్నామని వ్యాఖ్యానించారు. పిరికిపందల్లా పార్టీని వీడేవారి గురించి ఆలోచించేది లేదని తెలిపారు. కొంతమంది రాజీనామా వల్ల పార్టీ లక్ష్యం మాత్రం మారదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉంటే కమల్ పార్టీకి మహేంద్రన్‌తో పాటు పార్టీలో కీలక నేతలైన ఏజీ మౌర్య, మురుగనందమ్, సీకే.కుమరావెల్, ఉమాదేవీ సైతం రాజీనామా చేశారు. ఈ విషయాన్ని పార్టీ అధికారికంగా ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.