భూమి గుడ్రంగా ఉంటుందంటారు. ఎక్కడ మొదలైనా.. తిరిగి అక్కడికే రావాలంటారు. ఇది రాజకీయాలకు కూడా వర్తిస్తుంది. తాజాగా బెంగాల్ రాజకీయాల్లో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. 2017లో పార్టీని వీడిపోయిన ముకుల్ రాయ్ బీజేపీలో చేరారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు సుభ్రాంషు రాయ్ కూడా బీజేపీలో చేరారు. అయితే ఈ రోజు(శుక్రవారం) ఆయన తిరిగి తృణమూల్ కాంగ్రెస్ గూటికే చేరారు. సీఎం మమతా బెనర్జీ సమక్షంలో ఆయన పార్టీకి తిరిగొచ్చారు.
ముకుల్ రాయ్ తిరిగి రావడంపై బెంగాల్ సీఎం, తృణమూల్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ స్పందించాడు. ‘‘కుమారుడు తిరిగి సొంతింటికి చేరుకున్నాడు. ముకుల్ రాయ్ ఇంటి పిల్లవాడు. తిరిగి ఇంటికి వచ్చేశాడు. ఆయనను సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. పార్టీలో చాలా ముఖ్యమైన పాత్రను పోషించబోతున్నారు. బీజేపీలో చాలా దోపిడీ ఉంది. అందులో మనగలగడం అంత సులువేమీ కాదు’’ అంటూ మమత వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే కృష్ణా నగర్ శాసన సభ్యత్వానికి ముకుల్ రాయ్ రాజీనామా చేయనున్నట్లు సమాచారం. అక్కడి నుంచి ఆయన కుమారుడు సుభ్రాంషు రాయ్ బరిలోకి దిగబోతున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తృణమూల్‌లోకి రాక ముందు ముకుల్ రాయ్ 4 సార్లు సీఎం మమతతో ఫోన్లో చర్చించారు. లెక్క ప్రకారం ఎన్నికల కంటే ముందే ముకుల్ తృణమూల్‌లో చేరిపోవాలని భావించారు. బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్‌తో ఆయనకు పొసగక పోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.