ప్రతిభ ఎవరి సొత్తూ కాదూ. ప్రతిభ ఉన్న వారి ముందు లోకం దాసోహం అంటుంది. ఇలాంటి మాటలు తరచూ వింటూ ఉంటాం. కానీ ఇవి వినడానికి ఎంత గొప్పగా ఉంటాయో.. ఆచరణలో మాత్రం అంతంతం మాత్రంగానే పనిచేస్తాయి. అందుకే కొందరు ఎంత ప్రతిభ ఉన్నా.. గుర్తింపు లేకుండా దుర్భర జీవితాన్నే గడుపుతారు. తాజాగా పంజాబ్‌కు చెందిన ఓ 23 ఏళ్ల కరాటే అథ్లెట్ దీనగాథ కూడా ఇలాంటిదే తాజాగా వెలుగులోకొచ్చింది. ఒకప్పుడు దేశం తరపున స్వర్ణ పథకాలను సాధించి సత్తా చాటిన ఆమె ఇప్పుడు రోజూ కూలీకి కూలిపనులకు వెళుతోంది. రోజుకు రూ.300 సంపాదన కోసం వరి పొలాల్లో పని చేస్తోంది. ఆమె పేరు హర్దీప్ కౌర్.
అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన హర్దీప్.. ప్రస్తుతం కుటుంబ పోషణ నిమిత్తం దినసరి కూలీగా మారింది. ఇప్పటి వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో 20కి పైగా పతకాలు సాధించిన హర్దీప్.. ఇప్పుడు ఇలా మట్టి పనికి వెళ్లడం నిజంగా దారుణమనే చెప్పాలి. కుటుంబ కష్టాలు, పాలకుల నిర్లక్ష్యం వెరసి ఆమె జీవితాన్ని దీనస్థితికి చేర్చాయి.
2018లో మలేషియాలో జరిగిన కరాటే పోటీల్లో ఆ యువ ఫైటర్ స్వర్ణ పతకం సాధించి దేశం పేరు నిలబెట్టింది. దాంతో ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దాంతో తన కష్టాలన్నీ తీరిపోయాయని, తల్లిదండ్రులను ఇక ఆనందంగా చూసుకోవచ్చని ఆమె అనుకుంది. కట్ చేస్తే.. ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చి మూడేళ్లు గడిచింది. కానీ ఇప్పటివరకు ఎలాంటి ఉద్యోగం రాలేదు. దీంతో ఆమె ఆశలన్నీ కలలుగానే మిగిలిపోయాయి.
ఆ యువ కరాటే ఫైటర్ పేరు హర్దీప్ కౌర్. పంజాబ్‌కు చెందిన 23 ఏళ్ల హర్దీప్‌కు మూడేళ్ల క్రితం గోల్డ్ మెడల్ సాధించినప్పుడు అప్పటి పంజాబ్ క్రీడామంత్రి రాణా గుర్మీత్ సోధీ.. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ అది అమల్లోకి రాలేదు. ఉద్యోగం కోసం ప్రభుత్వ పెద్దలను ఎన్నిసార్లు కలిసినా ప్రయోజనం లేకుండా పోయిందని, దీంతో కుటుంబాన్ని పోషించేందుకు వేరే మార్గం లేక పొలం పనులకు వెళ్లాల్సి వస్తోందని హర్దీప్ వాపోయింది.
‘నాన్న నయాబ్ సింగ్, అమ్మ సుఖ్విందర్ కౌర్ నా క్రీడా భవిష్యత్తు కోసం చాలా శ్రమించారు. ఉన్నది అమ్ముకుని నన్ను ఈ స్థాయికి తెచ్చారు. వారి బాధ చూడలేకే వారితో కలిసి పనికి వెళ్లాలని నిర్ణయించుకున్నా. అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాక ఇటువంటి పరిస్థితి వస్తుందని నేనెప్పుడు ఊహించలేదు’ అంటూ హర్దీప్ కన్నీళ్లు పెట్టుకుంది. అయితే కూలిపనులకు వెళుతున్నా.. విద్యను(ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా) మాత్రం అశ్రద్ధ చేయలేదని, ఇప్పటికీ శిక్షణ తీసుకుంటూనే ఉన్నానని తెలిపింది. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారని ఆమె ఆశగా ఎదురు చూస్తున్నానని చెప్పుకొచ్చింది.