దేశంలో కరోనా కేసులు ఈ మధ్య కొద్దిగా తగ్గుముఖం పడుతున్నాయి. రోజుకు 4 లక్షల కేసుల నుంచి రెండున్నర లక్షకు తగ్గింది. అయితే ఒకపక్క కరోనా విజృంభిస్తున్న సమయంలో మరో ఫంగస్ మహమ్మారి బ్లాక్ ఫంగస్(మ్యూకోర్మకోసిస్) చాపకింద నీరులా ప్రవేశించింది. కరోనానుంచి కోలుకున్న వారే టార్గెట్‌గా దాడి చేసింది. దీనిని నిరోధించేందుకు అవసరమైన ఆంఫోటెరిసిన్-బీ ఔషధం కొరత వల్ల అనేకమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అలాంటి సమయంలో కరోనాతో బాధపడుతున్న రోగి శరీరంపై కూడా ఈ ఫంగస్ దాడి చేస్తుందని వైద్యులు గుర్తించారు. కొందరు కరోనా బాధితుల్లో ఈ ఫంగస్‌ను కూడా గుర్తించారు. ఇక ఈ మహమ్మారి బారిన పడివారికి శస్త్ర చికిత్స చేసి ఇన్ఫెక్షన్ సోకిన భాగాలను తొలగించాల్సి ఉంటుంది. ఇప్పటికే కొందరు బాధితులు కళ్లు, దవడ భాగాలను కోల్పోయారు కూడా. అయితే కొందరి ప్రాణాలు దక్కకపోవడం శోచనీయం. మెడిసిన్స్ అందుబాటులో లేకపోవడమే దీనికి ముఖ్య కారణంగా తెలుస్తోంది. అయితే బ్లాక్ ఫంగస్ బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
బ్లాక్ ఫంగస్ బారిన పడకూడదంటే..
బ్లాక్ ఫంగస్ బారిన పడకుండా ఉండాలంటే ప్రధానంగా నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి. నోటి శుభ్రతతో 100 శాతం బ్లాక్‌ఫంగస్ దరి చేరదు. దానికోసం రోజూ రెండుసార్లు బ్రష్ చేయాలి. చిగుర్లు వాపులు లేకుండా చూసుకోవాలి. ఒకవేళ ఎవరికైనా వాపు ఉంటే మెట్రోజెల్‌తో రుద్దుకోవాలి. పళ్లకు సంబంధించి ఏవైనా సమస్యలుంటే వెంటనే వైద్యుల సలహాలతో మందులు వాడాలి. అవసరం అయితే 5 రోజులు యాంటిబయాటిక్స్ వాడాలి. ఉదయం సాయంత్రం ఉప్పునీరు పుక్కిలి పట్టాలి.
ఈ వ్యాధి ఎవరికి సోకుతుంది..?
షుగర్ వ్యాధి ఉండి కరోనాతో చికిత్స పొందుతున్న వారు, చికిత్సనుంచి కోలుకున్న వారూ దీనిబారిన పడే అవకాశం ఉంది. ముఖ్యంగా వక్కాకు, మావా, ఖైనీ, పొగాకు, పాన్ మసాలా తినేవాళ్లలో షుగర్ లేకపోయినా ఈ వ్యాధి వస్తా ఉంది. ఇవి నమలడం వలన వీరి చిగుర్లు దెబ్బతిని ఉంటాయి. దీంతో వీరు బ్లాక్‌ఫంగస్ బారినపడే అవకాశాలు ఎక్కువ. ప్రధానంగా కరోనా బారిన పడి హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నవాళ్లు, ఆసుపత్రిలో అడ్మిట్ అయినవాళ్లు, మధుమేహంతో బాధపడేవాళ్లు, వక్కాకు, పాన్‌మసాలా, పొగాకు నమిలే అలవాటు ఉన్నవాళ్లు తప్పనిసరిగా ఈ జాగ్రత్తలన్నీ పాటించాలి.
బ్లాక్‌ఫంగస్ సోకితే..?
వీలయినంత త్వరగా డాక్టర్‌ను కలవాలి. ట్రీట్‌మెంట్ వెంటనే మొదలుపెట్టాలి. తగ్గకపోతే ఎంత త్వరగా వీలైతే త్వరగా ఆపరేషన్ చేసి ఇన్ఫెక్ట్ అయిన భాగాన్ని తీసేయాలి. అయితే ఈ ఫంగస్ వల్ల ముఖ్యంగా ముఖ భాగం తీవ్రంగా ప్రభావం అవుతుంది. అందువల్ల కొన్నిసార్లు కళ్లు, దవడ భాగాలు తొలగించాల్సి వస్తుంది. బ్లాక్‌ఫంగస్ వ్యాధికి వైద్యం అంత సులువు కాదు. వైద్యులకు ఇదే పెద్ద పరీక్ష. అలాగే శస్త్ర చికిత్స చాలా ఖర్చుతో కూడుకున్న పని. అయితే ఔషధాల కొరత కారణంగా శస్త్రి చికిత్స తరువాత కూడా బాధితుల ప్రాణాలకు డాక్టర్లు గ్యారెంటీ ఇవ్వలేకపోతున్నారు.