కరోనా దెబ్బకు దేశం అతలాకుతలం అవుతోంది. ఒకపక్క రోజూ వేల మంది ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతుండగా.. మరో పక్క దేశ ఆర్థి వ్యవస్థ కూడా అథఃపాతాళానికి వెళ్లిపోతోంది. ముఖ్యంగా ఈ ఏడాది సెకండ్ వేవ్ కారణంగా అనేక రాష్ట్రాల్లో అమలవుతున్న లాక్‌డౌన్‌ల కారణంగా 2021-22 ఆర్థిక సంవత్సరంలోని తొలి త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థకు దాదాపు రూ.5 లక్షల కోట్ల మేర నష్టపోయే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గతేడా లాక్ డౌన్ కారణంగా రూ.11 లక్షల కోట్లు నష్టం వాటిల్లిందని, ఇక ఈ ఏడాది మరింత దారుణంగా మూడు నెలల్లోనే రూ.5 నుంచి రూ.6 లక్షల కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఆర్థిక నష్టానికి సంబంధించి పలు సంస్థలు చేసిన పరిశోధన నివేదికలను ప్రకటించాయి. అందులో ఎస్‌బీఐ తాజా నివేదిక ప్రకారం.. ప్రస్తుత త్రైమాసికంలో నామినల్ జీడీపీ నష్టం రూ.6 లక్షల కోట్లు ఉండవచ్చు. అలాగే బార్‌క్లేస్ అంచనా ప్రకారం.. రూ.5.4 లక్షల కోట్లని అంచనా. దీనిని బట్టి చూస్తే వాస్తవ జీడీపీ వృద్ధి 10 నుంచి 15 శాతం వరకు ఉంటుంది. కానీ ఆర్బీఐ మాత్రం 26.2 శాతం ఉంటుందని అంచనా వేసింది. మరి ఈ రెండు లెక్కల్లో ఏది నిజమో తేలాల్సి ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లో కరోనా థర్డ్ వేవ్ కనుక వస్తే.. ఇక ఆర్థి వృద్ధి అథఃపాతాళానికి చేరుతుందని నిపుణులు ఆందోళణ వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే దాదాపు మరో రూ.3 లక్షల కోట్లు నష్టపోవలసి వస్తుందని, ఫలితంగా వార్షిక వృద్ధి రేటు దాదాపు 3 శాతం తగ్గుతుందని, సుమారు 8 శాతానికి పరిమితమవుతుందని హెచ్చరిస్తున్నారు.