టీమిండియా చరిత్రలో ది బెస్ట్ స్పిన్నర్ ఎవరంటే అనిల్ కుంబ్లే అని చెప్పాల్సిందే. అందులో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు టెస్ట్ క్రికెట్‌లో భారత్ తరపున టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన బౌలర్ అనిల్ కుంబ్లే. ప్రపంచ దేశాల బ్యాట్స్‌మన్‌లంతా అనిల్ కుంబ్లేను ఎదుర్కోవాలంటే ఎంతో జాగ్రత్తగా ఉండేవారు. అంతేకాదు అనేక మంది బ్యాట్స్‌మన్‌లకు కుంబ్లే పీడకలగా నిలిచాడంటే అతిశయోక్తి కాదు. కాగా.. ఇటీవల శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర అనిల్ కుంబ్లే గురించి కొన్ని ఆసక్తికర విశేషాలను వెల్లడించాడు. కుంబ్లే వల్ల తాను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని సంగక్కర చెప్పుకొచ్చాడు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సంగక్కర.. “ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్”కు ఎంపికైన నేపథ్యంలో టీమిండియా స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లేపై శ్రీలంక, పాకిస్తాన్‌లకు చెందిన మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపించారు. కుంబ్లే కారణంగా అనేక నిద్రలేని రాత్రులు గడిపానని లంక ఆల్‌టైమ్ గ్రేట్ ఆటగాడు సంగక్కర కొనియాడాడు. వేగం, కచ్చితత్వం అతని ప్రధాన ఆయుధాలని, వీటితో కెరీర్ ఆసాంతం తనను చాలా ఇబ్బంది పెట్టాడని పేర్కొన్నాడు. అతని ఎత్తు అతనికి అడ్వాంటేజ్ అని, దాని వల్ల అతను విసిరిన బంతులు బాగా బౌన్స్ అయ్యేవని గుర్తు చేసుకున్నాడు. బౌలర్‌గా తనను ఇబ్బంది పెట్టినా, వ్యక్తిగతంగా చాలా మంచివాడని అభినందించాడు.
ఇక శ్రీలంకకే చెందిన మరో ఆటగాడు జయవర్ధనే కూడా కుంబ్లేపై ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ ఎవరైనా.. అతడిని కట్టడి చేసేందుకు కుంబ్లే వద్ద కచ్చితమైన ప్రణాళిక ఉంటుందని, ఆ ప్రణాళిక ప్రకారమే కుంబ్లే అద్భుతమైన ఫలితాలు సాధించాడని జయవర్ధనే చెప్పుకొచ్చాడు. కుంబ్లే బలాలేంటో తనకు బాగా తెలుసని, ఏ బంతిని ఎదుర్కోవలసి వస్తుందోనని బ్యాట్స్‌మన్ ఎప్పుడూ ఆలోచనలో పడేలా చేయడం కుంబ్లే ప్రత్యేకత అని జయవర్దనే చెప్పాడు.
ఇక పాక్ ఆటగాళ్లు కూడా కుంబ్లేపై ప్రశంసలు కురిపించారు. పాక్ మాజీ ఆటగాడు వసీమ్ అక్రమ్ కుంబ్లేను ప్రశంసలతో ముంచెత్తాడు. ఢిల్లీలో కుంబ్లే తమపై 10 వికెట్లు తీయడం ఇప్పటికీ తన కళ్లముందే జరిగినట్లుందని, అతని 10వ వికెట్ తానే కావడంతో ఆ చారిత్రక ఘట్టాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం తనకు దక్కిందని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే కుంబ్లే భారత్ తరఫున 132 టెస్టులు, 271 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 619, వన్డేల్లో 337 వికెట్లు పడగొట్టాడు. అతను టీమిండియా కోచ్‌గా కూడా కొంత కాలం పనిచేశాడు