Wednesday, January 22, 2025

కుబేరులను చేసిన కరోనా టీకా.. కొత్తగా 9 మంది

ఒకరి అవసరం మరొకరికి అవకాశం. అవసరం స్థాయి పెరిగే కొద్దీ అవకాశం విలువ పెరుగుతుంది. కరోనా విషయంలోనూ అదే జరుగుతోంది. గతేడాది కరోనా ఫస్ట్ వేవ్ నుంచి ఇప్పటి సెకండ్ వేవ్ వరకు ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తోంది. రోజూ లక్షల కేసులు నమోదవుతున్నాయి. వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎంతోమంది ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి దీన స్థితికి చేరుతున్నారు. అయితే ఇదే మహమ్మారి వల్ల కొందరు బిలియనీర్లుగా మారారు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. దీనికి కారణం వ్యాక్సిన్.

కరోనా మహ్మమారిని నిరోధించేందుకు వివిధ దేశాల్లోని ఫార్మా సంస్థలు శాస్త్రవేత్తలతో చేతులు కలిపాయి. ముమ్మర పరిశోధనలు చేసి కరోనా వ్యాక్సిన్లను తయారుచేశాయి. ఈ వ్యాక్సిన్లు ప్రపంచం మొత్తానికి ఇంకా చేరకముందే సదరు ఫార్మా సంస్థలకు లాభాల పంట పండుతోంది. ఆయా ఫార్మా సంస్థల యజమానులు బిలియనీర్లుగా మారుతున్నారు. కరోనాతో ప్రపంచం మొత్తం కల్లోలానికి గురైనా.. ఈ మహమ్మారిని అంతమొందించేందుకు వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తున్న ఫార్మా సంస్థలకు మాత్రం ఇది కాసుల వర్షం కురిపిస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే వ్యాక్సిన్లను తయారు చేసిన ఫార్మా కంపెనీల యజమానులైన 9 మంది అపర కుబేరులుగా అవతారమెత్తారు. దీ పీపుల్స్‌ వ్యాక్సిన్‌ అలయన్స్ అనే సంస్థ ఈ వివరాలను తెలిపింది. వ్యాక్సిన్ వల్ల గడించిన లాభాల కారణంగానే ఈ 9 మంది బిలియనీర్ల జాబితాలో చేరినట్లు వెల్లడించింది. ఫోర్బ్స్‌ రిచ్‌ లిస్ట్‌ ఆధారంగా ఈ 9 మంది మొత్తం నికర సంపద 19.3 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఇక ఇప్పటికే బిలియనీర్ల లిస్ట్‌లో ఉన్న మరో 8 మంది 32.2 బిలియన్‌ డాలర్లు మేర లాభాలు గడించి తమ సంపద పెంచుకున్నారు. కొత్తగా చేరిన కుబేరుల్లో మోడెర్నా సంస్థ సీఈవో స్టీఫెన్‌ బాన్సెల్‌, బయోఎన్‌టెక్‌ వ్యవస్థాపకుడు ఉగర్‌ సహిన్‌ టాప్‌లో ఉన్నారు. చైనా వ్యాక్సిన్‌ కంపెనీ కాన్‌సినో బయోలాజిక్స్‌‌కు చెందిన ముగ్గురు కో ఫౌండర్స్ కూడా ఈ బిలియనీర్ల జాబితాలో చేరారు.

కొత్తగా చేరిన బిలియనీర్ల మొత్తం సంపదతో తక్కువ ఆదాయం ఉన్న దేశాల్లోని ప్రజలందరికీ 1.3 రెట్లు టీకాలు అందించొచ్చని పీపుల్స్‌ వ్యాక్సిన్‌ అలయన్స్ పేర్కొంది. దీనిపై స్పందించిన పీపుల్స్ వ్యాక్సిన్ సంస్థ దేశంలో వ్యాక్సిన్ సంస్థల ఏకఛత్రాధిపత్యానికి ఇదే నిదర్శనమని, ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో పోరాడుతుంటే.. దానివల్ల వీరంతా బిలియనీర్లుగా మారడం దారుణమని పేర్కొంది. ఇప్పటికైనా వ్యాక్సిన్‌ టెక్నాలజీపై దిగ్గజ కార్పొరేట్ సంస్థల ఆధిపత్యాన్ని ఆపాలని పిలుపునిస్తోంది.

కాగా.. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ల తయారీకి సంబంధించి సంస్థలకు పేటెంట్ హక్కులను తాత్కాలికంగా రద్దు చేయాలంటూ అనేక దేశాలు అభ్యర్థిస్తున్నాయి. భారత్ కూడా ఈ మేరకు అభ్యర్థించిన దేశాల్లో ఉంది. దీనివల్ల అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా వ్యాక్సిన్‌ తయారీలో భాగస్వామిగా మారతాయని ఆయా దేశాల్లోని నిపుణులు చెబుతున్న మాట.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x