ప్రకృతి పగబట్టినట్లుంది. అన్ని వైపుల నుంచి ప్రజా జీవనాన్ని అల్లకల్లోలం చేస్తోంది. ఒకపక్క కరోనా, మరో పక్క బ్లాక్, వైట్ ఫంగస్‌లతో అలమటిస్తున్న ప్రజలను తౌక్టే తుఫాను కూడా భయభ్రాంతులకు గురి చేస్తోంది. పదుల సంఖ్యలో ప్రాణాలను బలి గొంటోంది. దక్షిణ భారత దేశంలో, సమీప సముద్రంలో కల్లోలం సృష్టిస్తోంది. తౌక్టే కారణంగానే ఇటీవల అరేబియా సముద్రంలో బార్జ్ ‘పి305’ మునిగిపోయిన విషయం తెలిసిందే. ఓడలో ఉన్న అనేకమంది ఈ ప్రమాదంలో సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి మృతదేహాలను వెలికి తీసే పనిలో పడ్డారు రెస్క్యూ సిబ్బంది. ఇప్పటి వరకు 49 మంది మృతదేహాలను వెలికి తీశారు.
దుర్ఘటన సమయంలో బార్జ్‌లో 261 మంది ఉండగా, వారిలో 186 మందిని రక్షించినట్టు నేవీ అధికారులు తెలిపారు. అలాగే, టగ్‌బోట్ వరప్రద నుంచి ఇద్దరిని రక్షించినట్టు పేర్కొన్నారు. ఇంకా 37 మంది జాడ కనిపించడం లేదన్నారు. వీరిలో 26 మంది బార్జ్ పీ305లోని సభ్యులు కాగా, టగ్‌బోటుకు సంబంధించి 11 మంది ఉన్నారు. గల్లంతైన వారి కోసం నేవీ ఉదయం నుంచి ఏరియల్ సెర్చ్ మొదలు పెట్టింది. హెలికాప్టర్‌లతో ఈ సెర్చ్ ఆపరేషన్‌ను నిర్వహిస్తున్నారు. 4 రోజుల క్రితం ముంబై తీరంలో హెలికాప్టర్లను మోహరించింది. ఇంకా ఎవరైనా సజీవంగా ఉండొచ్చన్న ఆశతో నౌకలు కూడా సెర్చ్ లైట్ల సాయంతో రాత్రంతా గాలింపు చర్యలు చేపట్టాయి. ఐఎన్ఎస్ కొచ్చి ప్రస్తుతం ఈ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తోంది. కనీసం మరో 3 రోజులపాటు గాలింపు చర్యలు కొనసాగనున్నట్టు నేవీ కమాండర్ అజయ్ ఝా వెల్లడించారు.
కాగా.. వారం ముందే తౌక్తే తుఫాన్ గురించి హెచ్చరికలు తమకు అందాయని కానీ షిప్ కెప్టెన్ వాటిని పట్టించుకోలేదని, దానివల్ల ఈ ప్రమాదం సంభవించిందని నౌక చీఫ్ ఇంజనీర్ రెహ్మాన్ షేక్ వెల్లడించారు. ఆ బార్జ్ కెప్టెన్ ఒకవేళ తుఫాన్ హెచ్చరికలు పాటించి ఉంటే.. ఈ ప్రమాదం జరిగేది కాదని ఆ ఘటనలో ప్రాణాలు దక్కించుకున్న రెహ్మాన్ అన్నాడు. బార్జ్ ప్రమాదానికి కెప్టెన్, కంపెనీ తప్పుడు అంచనాలే కారణమని రెహ్మాన్ ఆరోపించాడు. బార్జ్ పీ305 ప్రమాదం నుంచి రక్షింపబడిన 188 మందిలో రెహ్మాన్ ఒకరు.
వారం క్రితమే సైక్లోన్ వార్నింగ్ అందిందని, చాలా వరకు నౌకలు తమ ప్రాంతం నుంచి తీరానికి వెళ్లిపోయాయని, మనం కూడా సురక్షిత ప్రాంతానికి వెళ్దామని కెప్టెన్ బల్విందర్ సింగ్‌ను కోరానని, కానీ అతను తన మాటలను పట్టించుకోలేదని రెహ్మాన్ అన్నాడు. గాలి వేగం గంటకు 40 కిలోమీటర్ల కన్నా అధికంగా ఉండదని కెప్టెన్ చెప్పాడని, ఒకటి రెండు రోజుల్లో తుఫాన్ ముంబై తీరాన్ని దాటుతుందని చెప్పాడని, కానీ నిజానికి గాలి వేగం గంటకు వంద కిలోమీటర్లు దాటిందని, ఆ ధాటికి తమ నౌక సముద్రంలో నిలువలేకపోయిందని షేక్ తెలిపాడు.