వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ముందు న్యూజిల్యాండ్‌కు భారీ దెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మన్ కేన్ విలిమ్సన్ గాయం బారిన పడ్డాడు. ఇంగ్లండ్‌తో జరగుతున్న టెస్టు సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టెస్టు ఆఖరిరోజు అతడు గాయపడ్డాడు. దీని కారణంగా కేన్ ఎడమ మోచేతికి గాయమైంది. వెంటనే ఫిజియో వచ్చి పరీక్షించి గాయం తీవ్రత పెద్దగా లేదని.. రెండ్రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని తెలిపాడు. కానీ కేన్ గాయం కివీస్‌ను కలవరానికి గురిచేస్తుంది. గాయం తీవ్రత ఎక్కువగా లేకున్నా.. టీమిండియాతో మరో 9 రోజుల్లో ఐసీసీ ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో విలియమ్సన్ గాయం ఒకవేళ మళ్లీ పెద్దదైతే జట్టుకు పెద్ద సమస్యేనని కివీస్ ఆందోళన చెందుతోంది.
కేన్ గాయంపై కివీస్ కోచ్ గ్యారీ స్టెడ్ స్పందించాడు. ‘కేన్ మోచేతి గాయంలో పెద్దగా తీవ్రత లేదు. ఇంగ్లండ్‌తో జరగనున్న రెండో టెస్టుకు కేన్ ఆడుతాడా లేదా అనే విషయంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అతని పరిస్థితి గమనించి నిర్ణయం తీసుకుంటాం. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఇంకా 9 రోజులు ఉంది. అందువల్ల విలియమ్సన్ ఆడడేమో అనే భయం లేదు. ఆ సమయానికి అతను పూర్తి ఫిట్‌నెస్‌తో బరిలోకి దిగుతాడు’ అని పేర్కొన్నాడు.
కాగా.. ఇదే మ్యాచ్‌లో కివీస్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ కూడా గాయపడ్డాడు. అతడి ఎడమ చూపుడువేలుకు గాయమైంది. దీంతో రెండో టెస్టు నుంచి అతడిని తప్పించారు. అతని స్థానంలో బౌల్ట్ తుది జట్టులోకి రానున్నాడు. ఈ విషయాన్ని కూడా కోచ్ గ్యారీ స్టెడ్ స్వయంగా వెల్లడించాడు.