టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ అని, అతనితో తనను పోల్చుతున్నందుకు గర్వపడుతున్నానని పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ అన్నాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్ జాబితాలో కోహ్లీని బాబర్ దాటేసి అగ్ర స్థానం దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో కోహ్లీతో తను పోల్చడంపై బాబర్ స్పందించాడు. వ్యక్తిగతంగా తాను ఎవరితోనూ పోల్చడాన్ని ఇష్టపడనని, అలా పోల్చడం వల్ల ఒత్తిడికి గురవ్వాల్సి వస్తుందని, అందుకే వీటిని పట్టించుకోనని చెప్పాడు.
‘విరాట్ ప్రపంచ క్రికెట్లో ఓ గొప్ప ఆటగాళ్లలో ఒకడు. ప్రతి మైదానంలో, పెద్ద మ్యాచుల్లో అతడు నిరూపించుకున్నాడు. ఎవరైనా మమ్మల్ని పోలిస్తే నేను ఒత్తిడికి గురవ్వను. అలాంటి పెద్ద ఆటగాడితో నన్ను పోలుస్తున్నందుకు గర్వంగా ఉంటుంది. వ్యక్తిగతంగా పోలికలు వద్దనే అనుకుంటాను. కానీ ప్రజలు పోలికలు చూస్తూనే ఉంటారు. నాకైతే సంతోషంగానే ఉంటుంది. నా లక్ష్యం ఒక్కటే. కోహ్లీలా నేనూ ఆడాలి. నా జట్టు విజయాలకు సాయపడాలి. నా దేశాన్ని గర్వించేలా చేయాలి’ అని బాబర్ చెప్పుకొచ్చాడు.
కానీ.. కోహ్లీ, తాను భిన్నమైన ఆటగాళ్లమని, ఎవరి ఆటతీరు వారిదని బాబర్ అన్నాడు. కానీ కోహ్లీలా జట్టుకు ఉపయోగపడేలా ఆడాలన్నదే తన లక్ష్యంమని, అందుకే తన శక్తిమేర ఆడేందుకు ప్రయత్నిస్తానని, క్రికెట్‌లో నాకీ గౌరవం దక్కినందుకు సంతోషంగా ఉందని అన్నాడు. పెద్ద ఆటగాళ్ల సరసన నా పేరు చేరడం గర్వంగా అనిపిస్తోందని, వెస్టిండీస్‌పై మూడు శతకాలు చేయడం తన కెరీర్‌లో కీలక మలుపని, అప్పుడే తన ఆత్మవిశ్వాసం పెరిగిందని చెప్పుకొచ్చాడు.