టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ 25 ఏళ్ల రికార్డును న్యూజిలాండ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ డేవాన్ కాన్వే బద్దలుకొట్టాడు. లార్డ్స్ వేదికగా అరంగేట్రం చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.. ఇప్పటివరకు ఈ రికార్డు గంగూలీ పేరిట ఉండేది. తాజాగా గంగూలీని కాన్వే అధిగమించాడు. దాదా 1996లో టీమ్‌ఇండియా తరఫున లార్డ్స్‌లో అరంగేట్రం చేశాడు. ఇంగ్లాండ్ బౌలింగ్‌ను చితక బాదేస్తూ 131 పరుగులు సాధించాడు. ఇప్పటి వరకు లార్డ్స్‌లో అరంగేట్రంలో అత్యధిక పరుగుల ఘనత గంగూలీ పేరిటే ఉండేది. తాజాగా దానిని కాన్వే బద్దలు కొట్టాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 136 పరుగులతో అజేయంగా నిలిచాడు.
గంగూలీ రికార్డును బద్దలు కొట్టడమే కాకుండా.. మరో అత్యంత అరుదైన ఘనతను కూడా తన ఖాతాలో వేసుకుని అరంగేట్రం ఇన్నింగ్స్‌తోనే ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్శించాడు. తొలి ఇన్నింగ్స్‌లోనే డబుల్ సెంచరీ సాధించి, టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఈ అరుదైన ఘనత సాధించిన 6వ ఆటగాడిగా నిలిచాడు. గతంలో టిప్ ఫోస్టర్(287), జాక్ రుడాల్ఫ్(222*), లారెన్స్ రోవ్(214), మాథ్యూ సింక్లెయిర్(214), బ్రెండన్ కురుప్పు(201*)లు ఈ ఫీట్ సాధించాడు. వారి తరువాత ఇప్పుడు కాన్వేనే ఆ ఘనత అందుకున్నాడు.
కాగా.. ఈ ఘనత సాధించిన కివీస్ ఆటగాళ్లలో మాథ్యూ సింక్లెయిర్ మొదటి స్థానంలో ఉండగా.. కాన్వే రెండో స్థానంలో ఉన్నాడు. అక్కడితో ఆగకుండా టెస్ట్ డెబ్యూలో బౌండరీతో సెంచరీని, సిక్సర్‌తో ద్విశతకాన్ని సాధించిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇక ఈ మ్యాచ్‌లో కాన్వే(347 బంతుల్లో 200; 22 ఫోర్లు, సిక్స్) ఒక్కడే ద్విశతకంతో పోరాడటంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 378 పరుగులకు ఆలౌటైంది. అతనికి హెన్నీ నికోల్స్(61), నీల్ వాగ్నర్(25 నాటౌట్) సహకరించడంతో కివీస్ గౌరవప్రదమైన స్కోర్ సాధించగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లలో అరంగేట్రం బౌలర్ రాబిన్సన్ 4 వికెట్లుపడగొట్టగా, మార్క్ వుడ్ 3, అండర్సన్ 2 వికెట్లు పడగొట్టారు.