టీమిండియా బౌలర్ కుల్‌దీప్ యాదవ్ ఒకప్పుడు టీమిండియా కీలక స్పిన్నర్‌గా ఉన్నాడు. ధోనీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు కుల్‌దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ మణికట్టు మాంత్రిక ద్వయంగా ప్రశంసలు అందుకున్నారు. కానీ టీమిండియా కెప్టెన్‌గా ధోనీ రిటైర్మెంట్ ప్రకటించినప్పటి నుంచి కుల్దీప్ యాదవ్ పరిస్థితి దారుణంగా తయారైంది. టీమిండియాకు ఎంపికవ్వడం లేదు. ఎంపికైనా తుది జట్టులో చోటు దక్కడం లేదు. ఒకవేళ తుది జట్టులో ఎంపికైనా.. కనీస ఫాం కూడా చూపించలేకపోగా.. భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. ఇక కుల్దీప్ మాత్రమే కాదు.. చాహల్ కూడా తన బౌలింగ్ విషయంలో ఇబ్బందులు పడుతున్నాడు.
ఇక తాజాగా రద్దయిన ఐపీఎల్ 14వ సీజన్‌లో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్.. కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున బరిలోకి దిగాడు. అయితే కేకేఆర్ జట్టు మొత్తం 8 మ్యాచ్‌లు ఆడినా.. ఒక్క మ్యాచ్‌లో కూడా అతడికి అవకాశం ఇవ్వలేదు. తన జట్టు ఒక్కసారీ అవకాశం ఇవ్వకపోవడంతో నిరాశపడ్డానని కుల్‌దీప్ యాదవ్ అన్నాడు. అయితే ఇది జట్టు యాజమాన్యం నిర్ణయమని, వారి వద్దకు వెళ్లి అడగడం తప్పని అన్నాడు. అయితే చెన్నై పిచ్ టర్న్‌కు అనుకూలించినా.. అక్కడా తనకు చోటు దక్కకపోవడంతో షాకయ్యానని, కానీ చేసేదేం లేదని కుల్‌దీప్ చెప్పుకొచ్చాడు. కొన్నిసార్లు తాను స్థాయికి తగినట్లు ఆడలేదని, అయితే ప్రత్యర్థిని బట్టి కూడా ప్రదర్శన జరగాలని అన్నాడు అన్నాడు.
‘కొన్నిసార్లు నేను వికెట్ల వెనకాల మహీభాయ్ మార్గనిర్దేశాన్ని మిస్సవుతాను. ఆయనది గొప్ప అనుభవం. వికెట్ల వెనకాల ఉండి మాకెప్పుడూ సలహాలు ఇచ్చేవారు. అయితే ఇప్పుడు ధోనీ లేడు. రిషభ్ మాత్రమే ఉన్నాడు. అతడు మరిన్ని మ్యాచులు ఆడితే భవిష్యత్తులో సలహాలు ఇవ్వగలడు. ప్రతి బౌలర్‌కు అవతలి ఎండ్‌లో భాగస్వామి ఉండాలని నా నమ్మకం. ధోనీ భాయ్ రిటైర్మెంట్ తరువాతనేను, చాహల్ కలిసి ఆడలేదు. ముఖ్యంగా వికెట్లు తీయాలంటే బౌలర్లకు వికెట్ల వెనక సరైన మద్దతు లభించాలని, కానీ ప్రస్తుతం ఆ మద్దతు లభించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. మరి అతడి ఆవేదన అర్థం చేసుకుని మరిన్ని అవకాశాలు లభిస్తాయేమో చూడాలి.