దేశంలో కరోనా విపరీతంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో నదుల్లో మృతదేహాలు బయటపడుతుండడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. నదుల్లో కొట్టుకొచ్చిన మృతదేహాలు కరోనా సోకి చనిపోయిన వారి మృతదేహాలనే అనుమానం నదీ పరివాహక ప్రాంత ప్రజలకు తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. నీటిలో మృతదేహాలు లభ్యం కావడం, అవి ఒకవేళ కరోనా వల్ల చనిపోయిన వారి మృతదేహాలైతే ఆ నీళ్లు తాగడం వల్ల తమకు కూడా వైరస్ సోకుతుదని ఆందోళన చెందుతున్నారు. నీటి ద్వారా కరోనా వైరస్ సంక్రమణపై అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు పేర్కొంటున్నారు.
బిహార్‌లోని గంగా నదిలో దాదాపు 71 మృతదేహాలు కొట్టుకొస్తున్నాయి. అయితే లక్షలాది మందికి గంగా నదే జీవనాధారం. దీంతో గంగా పరీవాహక ప్రాంతాల్లో నివసించే ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఈ నది నీటిని ఉపయోగిస్తే కరోనా వైరస్ సోకుతుందన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. యమునా నదిలో కూడా కరోనా బాధితుల శవాలు బయటపడుతున్నాయి. దీంతో ఈ నదుల్లో నీటిని తాగడానికే కాదు వినియోగించడానికి కూడా అనేకమంది ఆందోళన చెందుతున్నారు.
కానీ నదుల్లో మృతదేహాలు కొట్టుకురావడం వల్ల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. కరోనా సోకిన వారి మృతదేహాలను నదిలో వదిలినంత మాత్రాన వాటి ద్వారా వైరస్ నీటిలో కలుస్తుందని కానీ, ఆ నీటిని తాగడం వల్ల ప్రజలకు కూడా కరోనా సోకుతుందని కానీ ఎలాంటి ఆధారాల్లేవని గుర్తుచేశారు. గంగా, దాని ఉప నదుల్లో శవాలను వదిలేయడం కొత్తేమీ కాదని, అయితే గత 10–15 ఏళ్లలో ఇది గణనీయంగా తగ్గిందని అన్నారు.
నదిలో మృతదేహాలు ప్రవహించే సమయంలో నీటిలో కరోనా వైరస్ బలహీన పడడం వల్ల సంక్రమణ చెందే ప్రభావం అంతగా ఉండదని ఐఐటీ కాన్పూర్‌కు చెందిన ప్రొఫెసర్ సతీష్ తారే అభిప్రాయపడ్డారు. ప్రవాహ సమయంలో నీరు శుద్ధికావడం సాధారణ ప్రక్రియలో భాగమని చెప్పారు. అయితే ఆ నీటిని కొంతమంది నేరుగా తీసుకుంటూ ఉంటారని, అలాంటి వారు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
నదిలో శవాలను వదిలేస్తే నదీ కాలుష్యం పెరుగుతుందని తెలిపారు. నది నీటి ఉపయోగించుకునేవారు శుద్ధి చేసుకొని వాడుకోవాలని సూచించారు. నీటి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందన్న ఆందోళన అవసరం లేదని నీతి ఆయోగ్(హెల్త్) వీకే పాల్, ప్రభుత్వ సాంకేతిక సలహాదారు కే విజయ రాఘవన్ ఇప్పటికే స్పష్టం చేశారు. కొందరు ప్రజలు తాగునీటి కోసం నేరుగా నది నుంచే తీసుకునే సందర్భాలు ఉన్నాయని.. అలాంటి సందర్భాల్లో కొంత జాగ్రత్తలు పాటించాలన్నారు.