కర్ణాటక ప్రభుత్వం నీళ్లు కొట్టేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందాల్సిన నీటిని అక్రమంగా తమ కాల్వలకు తరలిస్తోంది. ఎలాంటి అనుమతులూ లేకుండా తుంగభద్ర జలాశయం వెనుక జలాల నుంచి 5 టీఎంసీలకు పైగా నీటిని అక్రమంగా ఎత్తిపోసుకుంటోంది. టీబీపీ బోర్డులోని ఏపీ, తెలంగాణ, కర్ణాటక సభ్యుల పరిశీలనలో ఈ విషయం బయటపడింది. ఇప్పటికే కేసీ కెనాల్, ఎల్లెల్సీకి కోటా ప్రకారం నీరు రావడం లేదు. తుంగభద్ర డ్యాం నుంచి కర్నూలు జిల్లా సరిహద్దు వరకూ కర్ణాటక రైతులు అడుగడుగునా నీటిని దోచుకుంటున్నారు. మరోవైపు కర్ణాటక ప్రభుత్వం కుంటి సాకులు చెబుతూ ఏటా ఎల్లెల్సీ, కేసీ కెనాల్ కోటా నీటికి కత్తెర పెడుతోంది. దీంతో ఎల్లెల్సీ, కేసీ కాల్వల ఆయకట్టుకు సరిపడా నీరు అందడం లేదు.
అయితే కర్ణాటక ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా, అక్రమంగా నీటిని కొట్టేస్తున్నా.. ఏపీ ప్రభుత్వం మాత్రం ఏమీ పట్టనట్లు చూస్తూ కూర్చుంటోంది. ఇప్పుడిదే విషయంలో ఆంధ్ర రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికొచ్చే సమయంలో నీరందక పైర్లు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అక్రమ ఎత్తిపోతల ద్వారా తుంగభద్ర జలాల్లో 5.02 టీఎంసీల నీటిని కర్ణాటక వాడుకుంటోందని నదీజలాల ట్రైబ్యునల్ తేల్చింది. 2 నెలల క్రితం ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల తుంగభద్ర బోర్డు సభ్యులు ఎత్తిపోతల పథకాలను పరిశీలించారు. తుంగభద్ర డ్యాంకు కుడి, ఎడమ వైపు కర్ణాటకలో 38 ఎత్తిపోతల పథకాలను వీరు పరిశీలించారు. నిరుపయోగంగా ఉన్న 8 ఎత్తిపోతల పథకాలతో పాటు కొత్తగా నిర్మిస్తున్న 4 ఎత్తిపోతల పథకాలను ఈ బృందం పరిశీలించింది. తాగునీటి కోసం నిర్మిస్తున్న పావగడ ఎత్తిపోతల పథకానికి 2 టీఎంసీలు ఇచ్చేందుకు కర్ణాటక ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇక్కడ వరకు బాగానే ఉన్నా, పాత ఎత్తిపోతల పథకాలకు 2 టీఎంసీల అనుమతి మాత్రమే ఉంది. కానీ 3.710 టీఎంసీల నీటిని వినియోగించుకున్నారని అధికారుల బృందం పరిశీలినలో తేలింది. కొత్తగా 3.335 టీఎంసీల సామర్థ్యంతో ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నారు. దీనికి ఎలాంటి అనుమతులు లేవని బోర్డు సభ్యులు, ఇంజనీర్లు గుర్తించారు. మొత్తంగా తుంగభద్ర నుంచి అక్రమంగా 5.02 టీఎంసీల నీటిని వాడుకుంటున్నట్లు ఇంజనీర్ల బృందం తేల్చింది. మూడు రాష్ట్రాల ఇంజనీర్ల బృందం ఈ అక్రమాలను గుర్తించింది.
కర్ణాటక అక్రమంగా నీటిని వినియోగించుకోవడంపై అదనంగా వాడుకుంటున్న 5 టీఎంసీల నీటి విషయమై త్వరలో జరగబోయే టీబీ బోర్డు సమావేశంలో చర్చిస్తామని కర్నూలు ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లు తెలిపారు. కర్నూలు ఎస్‌ఈ శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ.. ‘ఎల్లెల్సీ, కేసీ కెనాల్‌కు తుంగభద్ర జలాశయం నుంచి కోటా మేరకు నీరు అందడం లేదు. ఏదో ఒక కారణం చూపి, నీటిని నిలిపివేస్తున్నారు. కాలువలకు విడుదల చేస్తున్న నీటిని కూడా ఎగువ ప్రాంతంలో దారి మళ్లిస్తున్నారు. ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు తుంగభద్ర బోర్డు అధికారులు, ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారులకు కూడా నివేదిక రూపంలో సమాచారాన్ని అందిస్తున్నాం’ అని తెలిపారు.