తెలంగాణలో నేటి నుంచి లాక్‌డౌన్ నిబంధనలను పూర్తిగా ఎత్తివేసిన విషయం తెలిసిందే. అన్నిరకాల ఆంక్షలను ఎత్తివేస్తూ శనివారం రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు బస్సులు నడపడంపై మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఇక్కడి నుంచి ఆ రాష్ట్రానికి వెళ్లాలనుకునే వారిలో కొంత ఆందోళన నెలకొంది. అయితే వారి ఆందోలనను తొలగిస్తూ కేసీఆర్ ప్రభుత్వం ఏపీకి బస్సులను నడపడంపై కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో సడలించిన కర్ఫ్యూ నిబంధనలకు అనుగుణంగా బస్సులను నడపనున్నట్లు టీ సర్కార్ ప్రకటించింది.
లాక్‌డౌన్ ఎత్తివేతతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సర్వీసులు యథావిధిగా ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే రేపట్నుంచి ఏపీకి బస్సులు నడపనున్నట్టు తెలంగాణ ఆర్టీసీ వెల్లడించింది. ప్రభుత్వ ఆదేశాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఏపీలో లాక్‌డౌన్ నిబంధనలకు అనుగుణంగా బస్సు సర్వీసులు నడపనున్నట్లు టీఎస్ ఆర్టీసీ తెలిపింది.
రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ నిబంధనలు సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. సడలించిన నిబంధనల ప్రకారం.. సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. ఈ క్రమంలోనే అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని ఏపీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. కర్ఫ్యూ నిబంధనలకు అనుగుణంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకునే విధంగా ఏపీ నుంచి తెలంగాణకు, తెలంగాణ నుంచి ఏపీకి ఆర్టీసీ బస్సులు నడపనున్నారు. ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్ చేసుకుని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
కాగా.. కర్ణాటకకు కూడా టీఎస్ ఆర్టీసీ బస్సులు రేపటి నుంచి నడవనున్నాయి. అక్కడి నిబంధనల ప్రకారం..ఉదయం 5 గంటల నుంచి సాయత్రం 7 గంటల వరకు మాత్రమే బెంగళూరు మినహా మిగతా ప్రాంతాల్లో కర్ఫ్యూ ఉంటుంది. ఈ సమయానికి తగ్గట్లే రేపట్నుంచి టీఎస్ ఆర్టీసీ బస్సులు కర్ణాటకు వెళ్లనున్నాయి. అన్ని ప్రాంతాలకు టీఎస్ ఆర్టీసీ బస్ సర్వీసులు ఉండనున్నాయి.