మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై ఈటల చేసిన వ్యాఖ్యలు పూర్తి అర్థరహితమని, ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పాడు. ఈటల పార్టీని వీడటానికి అనేక కారణాలు ఉండొచ్చని, పార్టీలో ఉండాలా.. పోవాలా అనేది ఆయన ఇష్టమని చెప్పారు. అందులోకి తనను లాగడం, తన భుజం మీద తుపాకీ పెట్టి కాల్చాలనుకోవడం విఫల ప్రయత్నమని అన్నారు. ఈటల పార్టీకి చేసిన సేవకన్నా.. పార్టీ ఆయనకిచ్చింది ఎక్కువని చెప్పుకొచ్చారు.
అలాగే సీఎం కేసీఆర్ గురించి మాట్లాడుతూ.. తనకు కేసీఆర్ మార్గదర్శకుడని, తండ్రి కంటే ఎక్కువని కితాబిచ్చారు. కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు టీఆర్‌ఎస్‌లోనే ఉంటానని తేల్చి చెప్పారు. తాచెడ్డ కోతి వనమంతా చెరిచిందన్నట్లు ఈటల వైఖరి ఉందని ఎద్దేవా చేశారు. ఈటల పార్టీని వీడినా టీఆర్‌ఎస్‌కు వచ్చే నష్టమేమీ లేదని, తనకు పార్టీ ప్రయోజనాలే పరమావధి అని, నాయకత్వం ఏ పని అప్పగించినా పూర్తి చేయడం తన విధి అని చెప్పుకొచ్చారు.
‘‘తన గొడవలకు నైతిక బలం కోసం పదేపదే నా పేరు ప్రస్తావించడం.. ఈటల భావదారిద్ర్యానికి నిదర్శనం’’ అంటూ హరీశ్ ఈటలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా.. ఈ మధ్యనే ఈటల తన పదవికి, టీఆరెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత బీజేపీలో చేరేందుకు ఆయన పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే టీఆరెస్‌లో తనలానే హరీశ్ కూడా అవమానాలు భరిస్తున్నారని వ్యాఖ్యానించారు.