బీసీసీఐ తొలిసారిగా రెండు జట్లను బరిలోకి దించబోతోంది. ఇప్పటికే ఇంగ్లండ్ పర్యటన కోసం కోహ్లీ నేతృత్వంలో 20 మంది సభ్యులతో ఓ జట్టును ప్రకటించింది. అలాగే మరో వైపు శ్రీలంకతో జరిగే వన్డే, టీ20 సిరీస్ కోసం మరో జట్టును ప్రకటించబోతోంది. దీంతో భారత క్రికెట్ చరిత్రలో తొలిసారిగా బీసీసీఐ రెండు జట్ల పాలసీకి వెలుగులోకి తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు శ్రీలంక వెళ్లే జట్టుకు కెప్టెన్ ఎవరనే ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది. ఇంగ్లండ్ వెళ్లే జట్టుకు విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వహిస్తుండగా.. శ్రీలంక పర్యటనకు వెళ్లే జట్టుకు కెప్టెన్‌గా బీసీసీఐ ఎవరిని ఎంపిక చేస్తుందో తెలియాల్సి ఉంది. అయితే ఈ జట్టుకు కెప్టెన్సీ రేసులో ప్రస్తుతం ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. ఆ పేర్లే సీనియర్ ఓపెనర్ శిఖర్ ధనవ్, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య.
టీమిండియా మరో రెండు వారాల్లో ఇంగ్లండ్ పయనం కానుంది. అక్కడ కివీస్ జట్టుతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో తలపడుతుంది. ఆ తర్వాత ఆగస్టులో ఇంగ్లండ్‌తో సుదీర్ఘ టెస్ట్ సిరీస్ ఆడుతుంది. అదే సమయంలో టీమిండియా 2 జూలైలో శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్‌లో లంకతో భారత్ 3 వన్డేలు, 3 టీ20లు ఆడుతుంది. ఈ నేపథ్యంలో జట్టు కెప్టెన్ ఎవరనే దానిపై ఆసక్తికర చర్చ మొదలైంది. సీనియర్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధవన్, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాలలో ఒకరు కెప్టెన్‌గా ఎంపికయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. 8ఏళ్లుగా భారత పరిమిత ఓవర్ల జట్టులో ప్రధాన బ్యాట్స్‌మన్‌గా ఉన్న ధవన్ వరుసగా రెండు ఐపీఎల్‌లలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ధవన్‌కు కెప్టెన్సీ అనుభవం కూడా ఉంది.
అయితే యువ జట్టు కావడంతో యువకుడినే కెప్టెన్ చేయాలని బీసీసీఐ భావిస్తే.. హార్దిక్‌కు బీసీసీఐ కెప్టెన్సీ బాధ్యతలు అందించే అవకాశం ఉంది. ఈ మేరకు బీసీసీఐ సీనియర్ సభ్యుడొకరు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘హార్దిక్ ఒంటి చేత్తో మ్యాచ్‌ను మార్చగలడు. ఇలాంటి ఆటగాడికి నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే అతని ఆట మరింతగా మెరుగు పడవచ్చు. శ్రీలంక వంటి సిరీస్‌కు ఇలాంటి ప్రయోగాలు చేస్తే మంచిదే కదా’ అని సదరు అధికారి అన్నట్లు సమాచారం. మరి టీమిండియా 2 కెప్టెన్సీ ఎవరికి దక్కుతుందో చూడాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.