దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి రోజూ లక్షల సంఖ్యలో కొత్త కేసులు, వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. అయితే కొందరు ఈ మహమ్మారి నుంచి కోలుకుంటున్నా.. చాలా మందికి ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవడం లేదు. కరోనా నుంచి కోలుకున్న వారం, 10 రోజుల్లోనే బాధితుడి శరీరంలోకి మరో మహమ్మారి ప్రవేశిస్తోంది. అదే బ్లాక్ ఫంగస్‌గా పిలువబడే మ్యూకోర్మకోసిస్. ఈ ఫంగస్ బాధితులకు ప్రాణాంతకంగా మారుతోంది. ఒకవేళ ఆలస్యంగా గుర్తిస్తే శాశ్వత అంధత్వం, అంగవైకల్యాలు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా వేల కేసులు నమోదయ్యాయి. అనేక రాష్ట్రాల్లోని ఆసుపత్రుల్లో వీరంతా చికిత్స పొందుతున్నారు. అయితే కరోనా రోగుల్లోనే ఈ ఫంగస్ తలెత్తడానికి కారణం స్టెరాయిడ్స్ వాడడమేనని ఇన్నాళ్ల నుంచి నిపుణులు చెబుతూ వస్తున్నారు. కానీ తాజాగా జరిపిన ఓ అధ్యయనంలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన మహాత్మాగాంధీ స్మారక వైద్య కళాశాలలో మెడిసిన్ విభాగాధిపతి ప్రొఫెసర్ వీపీ పాండే 210 మంది బ్లాక్ ఫంగస్ రోగులపై చేసిన అధ్యయనం ద్వారా విస్తుగొలిపే అంశాలను వెల్లడించారు. బ్లాక్ ఫంగస్ బారిన పడడానికి స్టెరాయిడ్స్ మాత్రమే కారణం కాదని, మధుమేహం వంటి ఇతర అనారోగ్య సమస్యలు కూడా కారణం కాదని వెల్లడించారు. ఈ అధ్యయనం ప్రకారం.. బ్లాక్ ఫంగస్ బారిన పడిన వారిలో 14% మంది స్టెరాయిడ్స్ ఉపయోగించలేదు. 21% మందికి మధుమేహం లేదు. 36% మంది హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారు. 52% మంది రోగులు మాత్రమే బయటి నుంచి ఆక్సిజన్ తీసుకున్నారు. ప్రధానంగా 100% మంది యాంటీబయాటిక్స్ తీసుకున్న వారిలో ఈ ఫంగస్ కనిపించింది. అయితే ఈ అధ్యయనంలో జింక్ వినియోగంపై పరిశోధన చేయలేదు.
ఈ పరిశోధనకు సంబంధించి వివరాలను డాక్టర్ రాజీవ్ జయదేవన్ ట్విటర్‌లో వెల్లడించారు. ‘‘తాజా అధ్యయనం ఫలితాలను గమనిస్తే ఈ ఇన్‌ఫెక్షన్ తలెత్తడానికి స్టెరాయిడ్స్, మధుమేహానికి మించి ఇతరత్రా కారణాలున్నట్లు అనిపిస్తోంది. రోగులకు సూచించిన మందుల్లో అజిత్రోమైసిన్, డాక్సీసైక్లిన్, కార్బాపెనెమ్స్ లాంటివి కనిపించాయి. అందువల్ల ఫంగల్ ఇన్‌ఫెక్షన్ పెరగడానికి యాంటీ బయాటిక్సే కారణంగా అనిపిస్తోంది’’ అని జయదేవన్ అభిప్రాయపడ్డారు.