దేశంలో కరోనా విజృంభిస్తోంది. ప్రతిరోజూ లక్షల కేసులు నమోదవుతున్నాయి. వేల మంది మరణిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే మరో మహమ్మారి దాడి మొదలుపెట్టింది. అదే బ్లాక్ ఫంగస్. వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే వేల కేసులు దేశంలో నమోదయ్యాయి. వారంతా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఫంగస్‌కు సరైన చికిత్స, మెడిసిన్ కూడా లభించడం లేదు. ఇలాంటి తరుణంలోనే మరో ఫంగస్ దాడి మొదలు పెట్టింది. అదే వైట్ ఫంగస్.
కొద్దిరోజులుగా బ్లాక్ ఫంగస్ దేశంలో విజృంభిస్తున్న విషయం తెలిసిందే. అయితే బ్లాక్ ఫంగస్ విషయంలో ఇప్పటికే దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇక వైట్ ఫంగస్ కూడా ఇలానే ప్రాణాలు తీస్తుందని అంతా భయపడుతున్నారు. దీంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు మొదలయ్యాయి. అయితే వ్యాధిని సమయానికి గుర్తిస్తే పూర్తి స్థాయిలో చికిత్స చేయవచ్చని ఎల్‌వీ ప్రసాద్ కంటి వైద్యశాల రెటీనా స్పెషలిస్ట్ డాక్టర్ వివేక్ ప్రవీణ్ దవే అన్నారు. చికిత్స అందిస్తే రోగి ప్రాణానికి, కంటికి, చూపునకు ఎలాంటి ప్రమాదం ఉండదని ఆయన చెప్పారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ కేసులు చాలా అరుదని, భయపడాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు.
‘వైట్ ఫంగస్ శాస్త్రీయ నామం కాండిడా అల్బికాన్సీ. ఇది సహజంగానే శరీరంలో, బయటా ఉంటుంది. అతిగా పెరిగిన సందర్భంలోనే అనారోగ్యానికి దారి తీస్తుంది. పరీక్షల్లో తెల్లగా కనిపిస్తున్నందునే దీన్ని ‘వైట్ ఫంగస్’ అంటారు. ఇది కంటి గుడ్డులోని వివిధ భాగాలను ప్రధానంగా ప్రభావితం చేస్తుంది. కంటి లోపలి కణజాలాన్ని ముఖ్యంగా విట్రస్ జల్, రెటీనాపై ప్రభావం చూపుతుంది. సరైన చికిత్స అందకపోతే కంటి చూపును హరిస్తుంది. శరీరం మొత్తానికి సంక్రమిస్తే మాత్రం ప్రాణాంతకం. బలహీనంగా మారిన రోగుల్లో మాత్రమే ఇది జరుగుతుంది’ అని వివేక్ ప్రవీణ్ వెల్లడించారు.
లక్షణాలు:
కరోనా నుంచి కోలుకున్న ఒకటి నుంచి 3 నెలల్లో కంటి చూపు మందగిస్తుంది. కంటిలో నొప్పి మొదలై.. కన్ను ఎర్రబడుతుంది. మధుమేహం ఎక్కువగా ఉన్న వారిలో, రోగనిరోధక శక్తి కలిగిన వారిలో లేదా రక్తంలో అధికంగా మధుమేహం స్థాయి ఉన్నవారిలో ఈ వైట్ ఫంగస్ ఎక్కువ ప్రమాదరంగా సంక్రమిస్తుంది. కోవిడ్ బాధితుడు లేదా దాని నుంచి కోలుకున్న తర్వాత మొదటిసారిగా జ్వరం వచ్చిన 6 నుంచి 8 వారాల్లోపు ఈ మహమ్మారి దాడి చేయొచ్చు.
చికిత్స:
ఇంట్రాకోక్యురీ సర్జరీ, కంటి లోపల యాంటీఫంగల్ ఇంజెక్షన్లు ఇవ్వడం లేదా నోటి ద్వారా యాంటీఫంగల్ ఏజెంట్లను అందించడం ద్వారా వైద్యం చేయొచ్చు. తరచుగా శస్త్ర చికిత్సలు చేయాల్సి రావచ్చు. ఈ చికిత్సకు 4 నుంచి 6 వారాల సమయం పట్టవచ్చు.